అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల ప్రయారిటీపై పూర్తి క్లారిటీ ఉందని, ఈ ఏడాది పలు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెల్లడించారు. అదే విధంగా వచ్చే ఏడాది చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులపై రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన, పోతిరెడ్డిపాడుపైనా అనవసర రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణతో సమానంగా శ్రీశైలం నుంచి నీరు తీసుకుంటామని, ఇద్దరికీ సమన్యాయం జరుగుతుందని, ఎవరికీ అన్యాయం జరగదని సీఎం స్పష్టం చేశారు.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ‘మన పాలన–మీ సూచన’ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ‘వ్యవసాయం–అనుబంధ రంగాల’పై నిపుణులు, రైతులు, అధికారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమం కోసం ఇంకా ఏమేం చేయాలన్న అంశాలపై ఆయన వారితో మాట్లాడారు. మంత్రులు కె.కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, తానేటి వనిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటు, వ్యవసాయ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, రైతులు, బ్యాంక్‌ అధికారులు, నిపుణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ప్రజాధనం ఆదా:

వ్యవసాయం బతకాలంటే నీటి అవసరాలు తీరాలని, అందు కోసం ప్రాజెక్టులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఉన్న అవినీతిని పూర్తిగా తీసివేసి... వాటిని సరైన మార్గంలో పెట్టేందుకు సంవత్సరం కాలం పెట్టింది. జల వనరుల శాఖలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.1095 కోట్లు ఆదా చేశామని వివరించారు. పట్టించుకోకపోయి ఉంటే.., అది పూర్తిగా నాయకుల జేబుల్లోకి వెళ్లిపోయేది. నాయకుల జేబుల్లోకి కాకుండా ప్రభుత్వానికి ఆదా అయ్యేట్టుగా రివర్స్‌టెండరింగ్‌ద్వారా రూ.1095 కోట్లు ఆదాచేశాం. ఇవాళ ఏ ప్రాజెక్టులు ఎలా చేయాలి? వాటి ప్రాధాన్యతలు ఏంటి అన్నదానిపై మనసులో పూర్తి ప్రణాళిక ఉంది. ఇకపై యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తవుతాయని అన్నారు.

వంశధార ఫేజ్‌ –2 పూర్తి చేయాలని, వంశధార–నాగావళి అనుసంధానం పూర్తిచేయాలి, వెలిగొండ టన్నెట్‌ –1 పూర్తిచేయాలని, నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తిచేయాలని, అవుకు టన్నెల్‌ కూడా పూర్తిచేయాలని, ఈ ఏడాది వీటిని ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

''కోవిడ్‌ వల్ల పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణాలు కాస్త నెమ్మదించాయి. కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లారు. అయినా సరే వేగవంతం చేయడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఆ ఏడాది చివరికల్లా పూర్తయ్యేల పనులు పరుగులెత్తిస్తామని చెప్తున్నాం'' అన్నారు. 

రాయలసీమ ప్రాజెక్టులు–రాజకీయం

''రాయలసీమ కరువు నివారణ కోసం పలు ప్రాజెక్టులు చేపడితే, మీకు తెలుసు ఈ మధ్యకాలంలో ఎలా వివాదస్పదం చేస్తున్నారో చూస్తున్నాం. మన యుద్ధం ఒక్క తెలుగుదేశం, చంద్రబాబు నాయుడుతో మాత్రమే కాదు ఒక ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం. ఒక టీవీ–5తో యుద్ధంచేస్తున్నాం, ఒక ఏబీఎన్‌తో చేస్తున్నాం. ఒక చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

పోతిరెడ్డిపాడు:

‘రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు రావాలి అంటే రాని పరిస్థితి. కారణం శ్రీశైలం రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. కానీ పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీరు డ్రా చేసే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అంటే, శ్రీశైలంలో నీరు 881 అడుగులు ఉండాలి. అప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీరు డ్రా చేయవచ్చు. ఆ లెవెల్‌ 854 అడుగులకు పడిపోతే డ్రా చేసే సామర్థ్యం కూడా 7 వేల క్యూసెక్కులకు పడిపోయే పరిస్థితి మన కళ్ల ముందే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయి. కరువు ఎప్పుడు తీరుతుంది’ అన్ని ప్రశ్నించారు. 

‘మరోవైపు అల్మట్టి. దాని ఎత్తు కర్ణాటక పెంచుతూ పోతోంది. 519 మీటర్ల నుంచి 524 మీటర్లు పెంచుతున్నారు. అటు ఇటు ప్రాజెక్టులు కడుతున్నారు. మన దగ్గర వరద కేవలం 10 నుంచి 12 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల నీరు వస్తుంది. మరి అలాంటప్పుడు ప్రాజెక్టులు ఎప్పుడు నిండాలి?’ అన్నారు. 

‘పక్కన తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు వారికి 800 అడుగుల్లోనే ఉన్నాయి. 796 అడుగుల నీరు రాగానే వారు శ్రీశైలం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి మొదలు పెడతారు. మరి ఏ రకంగా రాయలసీమ ప్రాజెక్టులు నిండుతాయి. శ్రీశైలం నుంచి తెలంగాణ వారు 800 అడుగుల ఎత్తులోనే నీరు డ్రా చేస్తున్నారు. మనం కూడా అదే ప్లాట్‌ఫామ్‌ మీద పంపులు పెట్టి, 3 టీఎంసీలు డ్రా చేసుకోవచ్చు. ఆ విధంగా వారు 800 అడుగుల్లో, మనమూ 800 అడుగుల్లో ఉంటాం. ఎవరికి కేటాయించిన నీరు వారు వినియోగించుకుంటారు. ఎవరికీ నష్టం, కష్టం ఉండదు. న్యాయం అనేది సమానంగా జరుగుతుంది’ అని పేర్కొన్నారు. 

‘ఆ విధంగా రాయలసీమ డ్రాట్‌ మిటిగేషన్‌ కింద రూ.27 వేల కోట్లతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా పోలవరం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంచబోతున్నాం. ఆ కాలువ ప్రస్తుత సామర్థ్యం 17,500 క్యూసెక్కుల కాగా, దాన్ని 50 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచి ప్రకాశం బ్యారేజీ వరకు తీసుకొస్తే, చాలా ప్రాంతాలకు నీరు అందుతుంది. ఎందుకంటే అక్కడ అవసరాలు 25 వేల క్యూసెక్కులే. కాబట్టి మిగిలిన నీరు రాయలసీమ తరలించవచ్చు. రాష్ట్రం అన్ని విధాలుగా బాగు పడుతుంది. శ్రీశైలంలో నీరు కలపవచ్చు. ఆ విధంగా రైతులకు తోడుగా ఉంటాం. ఆ టెండర్లు కూడా పిలుస్తాం’అన్నారు. 

‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వ్యయం రూ.17 వేల కోట్లు. ఈ ఏడాది కొన్ని ప్యాకేజీలకు టెండర్లు పిలుస్తాం. ఇప్పటికే ఒక ప్యాకేజీకి టెండర్లు పిల్చాం. మిగిలినవి త్వరలో పిలుస్తాం’ అని సీఎం జగన్‌ వివరించారు.

ఈ ఏడాది కృష్ణా పరిస్థితి:

‘ఈ ఏడాది రికార్డు స్థాయిలో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలకు దేవుడి దయతో నీళ్లు వచ్చాయి. 12 ఏళ్ల తర్వాత కృష్ణా నదిలోకి ఇంత భారీ నీరు వచ్చింది. రాయలసీమ ప్రాజెక్టులకు ఎప్పుడూ లేని విధంగా నీటిని పంపించగలిగాం. 45.77 టీఎంసీల గరిష్టస్థాయిలో పులిచింతలలో నింపాం. సోమశిల ప్రాజెక్టులో కూడా 78 టీఎంసీల వరకు గరిష్టస్థాయిలో నింపాం. కండలేరులో 59.75 టీఎంసీల నీరు నింపే పరిస్థితి వచ్చింది’ అని ముఖ్యమంత్రి తెలిపారు.