డ్రోన్ షాట్ కోసమే: కందుకూరు చంద్రబాబు రోడ్‌షోపై ఏపీ సీఎం జగన్
కందుకూరులో చంద్రబాబు రోడ్ షో లో ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఫోటో షూట్ కోసమే ఈ తొక్కిసలాట జరిగిందన్నారు.
నర్సీపట్నం: ఫోటో షూట్ , డ్రోన్ షాట్ కోసం చేసిన ప్రయత్నం కారణంగానే కందుకూరులో తొక్కిసలాట జరిగిందని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. అనకాపల్లి జిల్లా నర్నీపట్నంలో శుక్రవారం నాడు జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. చంద్రబాబు సభలకు జనం రాకున్నా వచ్చినట్టుగా చూపించేందుకు ఇరుకు రోడ్డులోకి జనాన్ని పంపారన్నారు. ఆ తర్వాత ఆ రోడ్డులోకి చంద్రబాబు తన వాహనంతో రావడంతో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చంద్రబాబు సభలకు భారీ ఎత్తున జనం వచ్చారని చూపించేందుకు దుష్టచతుష్టయం, ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తుందన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో షూటింగ్ కోసం ఒక్కగేటు ఓపెన్ చేసి మిగిలిన గేట్లు మూసివేయడంతో అప్పట్లో 29 మంది మృతి చెందారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు.
ప్రతి వర్గాన్ని వంచించిన చంద్రబాబు సభలకు జనం ఎందుకు వస్తారని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే వెన్నుపోటు , మోసాలు మాత్రమే గుర్తుకు వస్తాయన్నారు.87వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేయలేదేన్నారు. ఈ హామీని నెరవేర్చినందుకు ధన్యవాదాలు చెప్పేందుకు రైతులు చంద్రబాబు సభలకు వస్తారా అని జగన్ ప్రశ్నించారు. 14, 204 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. పొదుపు సంఘాలను చంద్రబాబు నాశనం చేశారన్నారు. చంద్రబాబు సభలకు పొదుపు సంఘాల సభ్యులు ఏమైనా వస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టినందుకు జనం వస్తారా అని సీఎం అడిగారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హమీని చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు.
also read:ఈ భార్య కాకపోతే ఆ భార్య: పవన్ కల్యాణ్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏ ఒక్క స్కీమ్ కూడా సక్రమంగా అమలు చేయలేదని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. ఆనాడు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే పేదలకు పథకాలు అందాయని సీఎం జగన్ ఆరోపించారు. . విద్యార్ధుల చదవుకు అవసరమైన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను చంద్రబాబు నీరు గార్చాడని జగన్ విమర్శించారు.ఈ దుర్మార్గులను, వంచకులను చూసేందుకు జన్ వీరి సభలకు వస్తారా అని జగన్ ప్రశ్నించారు. మంచి చేస్తే లోకేష్, పవన్ కళ్యాణ్ లను ప్రజలు ఎందుకు ఓడిస్తారని సీఎం జగన్ ప్రశ్నించారు.