ప్రతి నియోజకవర్గానికి రూ. 2 కోట్ల నిధులకు సీఎం హామీ: ఏపీ మంత్రి బొత్స
గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి రూ. 2 కోట్ల నిధులను ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి వివరించారు.
అమరావతి: స్టేట్ డెవలప్ మెంట్ ఫండ్ నుండి నియోజకవర్గానికి రూ. 2 కోట్ల నిధులను విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలకు జగన్ దిశా నిర్ధేశం చేశారు.ఈ వర్క్ షాప్ ముగిసిన తర్వాత ఏపీ మంత్రి Botsa Satyanarayana వర్క్ షాప్ లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన తెలుసుకోవాలని సీఎం సూచించారన్నారు..గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ప్రతి నెల సమీక్ష ఉంటుందన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రతి గ్రామ సచివాలయానికి రూ. 20 లక్షలను గ్రాంట్ ఇస్తామని CM చెప్పారన్నారు. గోదావరికి వచ్చిన వరదను తమ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందన్నారు. Godavari పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకొందన్నారు.
ఇంత చేసినా కూడా విపక్షాలు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. Chandrababu ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హుదుద్ తుఫాన్ వస్తే ఏం చేశారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. హుదుద్ తుఫాన్ వచ్చిన సమయంలో మూడు రోజుల తర్వాత కానీ మంచినీళ్లు ఇవ్వని చరిత్ర చంద్రబాబుదేనని బొత్స విమర్శించారు.
అలాంటి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత ఉందా అని ఆయన అడిగారు.వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ వస్తాడు, ఏదో మాట్లాడి వెళ్లిపోతాడన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.
చంద్రబాబు అధికారంలో ఉంటే Pawan Kalyan నోటిపై వేలు వేసుకొని కూర్చొన్నారని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు హయంలో ముద్రగడను హింసిస్తే మాట్లాడలేదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాను అవమానించినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు.