పులిచింతల: ఏపీ సీఎం వైయస్ ప్రధాని నరేంద్రమోదీ తరహాలో వ్యూహరచన చేస్తున్నట్లున్నారు. స్టాట్యూఆఫ్ లిబర్టీ పేరుతో ప్రధాని మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నెలకొల్పిన విధంగానే ఏపీలో సీఎం జగన్ కూడా తన తండ్రి దివంగత సీఎం వైయస్ఆర్ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది.  

స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కుమనిషి సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించారు. గుజరాత్ లోని నర్మదా నదీతీరాన ఈవిగ్రహాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. 

ఇప్పుడు సీఎం వైయస్ జగన్ సైతం కృష్ణమ చెంత ఈ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు సమాచారం. పేదల పెన్నిధి పేరుతో రాజన్న అతిపెద్ద విగ్రహాన్ని పులిచింతల ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సుమారు 45 అడుగుల వైసీపీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.  

పులిచింతల ప్రాజెక్టు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న అనిల్‌ కుమార్‌ యాదవ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరె, సారెలను సమర్పించిన మంత్రి పులిచింతల ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.  

పులిచింతల ప్రాజెక్టు వద్ద సుమారు 45 అడుగుల వైయస్ఆర్ విగ్రహంతోపాటు వైయస్ఆర్ స్మృతి వనం, పార్కును నిర్మించనున్నట్లు తెలిపారు. వైయస్ఆర్ విగ్రహంతో పాటు డా. కెఎల్‌ రావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

పులిచింతల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రోడ్లు, భవనాలతోపాటు, నాలుగు కిలోమీటర్ల పాటు దిగువన ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ వారధి నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. 

సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు వద్ద స్థలాన్ని పరిశీలించినట్టు తెలిపారు. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం శుభపరిణామం అని చెప్పుకొచ్చారు. మరో ఇరవై ఏళ్ల పాటు రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.