CM Jagan: దళిత రైతులకు తీపి కబురు..
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ దళిత రైతులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ తీపికబురు చెప్పారు . ఏలూరు జిల్లాలోనే నూజివీడులో శుక్రవారం నాడు సీఎం భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నాయనీ, ఆ ముఠా నమ్మించి మోసం చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ తోడేళ్ల గుంపు ఎవరు?

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ దళిత రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ తీపికబురు చెప్పారు. ఏండ్ల తరబడి అనుభవదారులున్నా రైతులకు హక్కులు కల్పిస్తున్నామన్నారు. ఏలూరు జిల్లాలోని నూజివీడులో శుక్రవారం నాడు సీఎం భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసైన్‌మెంట్ భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2003 నాటి అసైన్‌మెంట్ భూములకు హక్కులు కల్పించారు. అదే సమయంలో అసైన్‌మెంట్ భూములకు పట్టాలను పంపిణీ చేశారు. ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిపై శాశ్వత హక్కు కల్పించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తన పాలనలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే 42 లక్షల ఎకరాల్లో భూ సర్వే పూర్తయిందని, నాలుగు వేల గ్రామాలకు భూ హక్కుల రీసర్వే పూర్తయిందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా భూ సర్వే చేసిన ఘనత తమ ప్రభుత్వానికే అందుతుందని, ఇప్పటికే రెండు విడతల సర్వే పూర్తైందని, మూడో విడత సర్వేలో త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. గిరిజన రైతుల పోడు భూములకు హక్కులు కల్పించామని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమనీ, అందుకే పేదలకు భూ హక్కులు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే.. 53 నెలల్లో 2.07 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని, వాటిలో 80 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారే అని తెలిపారు.
గతంలో చంద్రబాబు నాయుడు.. అసైన్డ్ భూములను అత్తగారి సొత్తులా భావించి.. ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చంద్రబాబు చేర్చారని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలను గుర్తించిన ప్రజలు 2019లో గూబగుయ్యిమని పిలిచారనీ, రీసౌండ్ ఇప్పటికీ వినిపిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కూర్చీలో ఉన్నప్పుడూ చంద్రబాబు పేదల్ని పట్టించుకోలేదనీ, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. పేదల పట్ల చంద్రబాబుకి ప్రేమ లేదనీ, ఇలాంటి వారిని ప్రజలు నమ్మరని జగన్ అన్నారు. తోడేళ్లు ఎన్ని గుంపుగా వచ్చినా, సింహం ఒక్కటిగానే వస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ లను పరోక్షంగా విమర్శించారు.ప్రతి పక్షాలను ఎదుర్కొనే ధైర్యం ప్రజలే ఇచ్చారని జగన్ అన్నారు.