అమరావతి: ఈ నెలాఖరువరకు బీసీ కార్పోరేషన్ల ఛైర్మెన్లు, డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ల ద్వారా గతంలో 69 కులాలే పరిగణలోకి తీసుకోగా ఇప్పుడు మొత్తం 139 కులాలు కూడా కవర్‌ అవుతాయని సీఎం చెప్పారు.

సోమవారం నాడు తన క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కొత్త బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్షించారు.బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని ఆయన అధికారులకు సూచించారు.

అందరికీ పథకాలు అందేలా చూడ్డం ప్రధాన బాధ్యతగా నడుచుకోవాలని సీఎం కోరారు.ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ 2,12,40,810 మంది బీసీలకు 22,685.74 కోట్ల రూపాయల లబ్ధి చోటు చేసుకొందని  సీఎం తెలిపారు. వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు నగదు బదిలీ చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. 

బీసీల అభ్యున్నతి కోసం ఇంత ఫోకస్‌గా గతంలో ఎవరూ ఎప్పుడూ పని చేయలేదని సీఎం వివరించారు. రూపాయి లంచం లేకుండా, వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నామన్నారు.

వైయస్సార్‌ చేయూత ద్వారా సింహభాగం లబ్ధి బీసీ మహిళలకే అందిస్తున్నట్టుగా చెప్పారు. కొత్తవాటితో కలుపుకుని బీసీల కోసం మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం 69 కులాలకే ప్రాధాన్యత  ఇచ్చిందన్నారు. కానీ తమ ప్రభుత్వం మొత్తం బీసీ కులాలన్నింటికీ కార్పొరేషన్లలో ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

జనాభా వారి స్థితిగతులను ప్రాతిపదికగా తీసుకుని ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. లోతుగా అధ్యయనం చేసి మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకొందన్నారు. 

కనీసం 30–35వేల జనాభా ఉన్న కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కులాన్ని ఏదో ఒక కార్పొరేషన్‌లో చేర్చినట్టుగా సీఎం వివరించారు. పది లక్షలకు పైబడి జనాభా ఉన్న కార్పొరేషన్లు–6, లక్షకు పైబడి 10 లక్షల లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లు –27, లక్ష లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లు 19 ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. దీంతో  మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ తీసుకు వస్తున్నామని సీఎం తెలిపారు. 18 నెలల్లోగా ఈ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీలను తీసుకురావడానికి కార్యాచరణ చేపడుతున్నామన్నారు.వారి స్కిల్స్‌ను అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు.

పెద్ద పెద్ద కంపెనీలను ఇందులో భాగస్వామిగా చేశామని సీఎం జగన్ చెప్పారు. జర్మనీ లాంటి దేశాలకు చెందిన అనేక పెద్ద పెద్ద సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయన్నారు.కార్పొరేషన్ల కింద ఉన్న వివిధ వర్గాల వారికి ఈ ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు.ఎవ్వరూ కూడా మిగిలిపోకుండా అందరికీ నైపుణ్యాభివృద్ధి అందేలా చూడాలని సీఎం జగన్ సూచించారు.

ప్రతి కార్పొరేషన్‌లోనూ ఒక స్కిల్‌ డెవల్‌మెంట్‌ ప్రతినిధి ఉండేలా చూడాల్సిందిగా కోరారు. అన్ని కార్పొరేషన్లకూ ఒకే భవనం నిర్మాణం చేయాలని  సీఎం ఆదేశించారు. కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకం ఈనెలాఖరు నాటికి పూర్తి కావాలన్నారు. ప్రతి కార్పొరేషన్‌లో 7 నుంచి 12 మంది డైరెక్టర్లు ఉండాలని ఆయన సూచించారు. 

సమావేశంలో  డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వేణుగోపాల కృష్ణ, పొన్నాడ సతీష్, విడదల రజని, జోగి రమేష్, పి.ఉమాశంకర్‌ గణేష్, అదీప్‌ రాజు, బుర్రా మధుసూదన్‌ యాదవ్, గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.