అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ హస్తినకు బయలుదేరారు. ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ నేరుగా అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో ఢిల్లీ బయల్దేరారు.

మధ్యాహ్నం 12.20గంటలకి సీఎం జగన్ ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ నుంచి తన అధికార నివాసమైన 1-జన్ పథ్ చేరుకుంటారు. అనంతరం కేంద్ర హోం శాఖ అమిత్‌షాతోపాటు పలువురు మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు.  

అమిత్ షాతోపాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్, పోలవరం నిధులు వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే రివర్స్ టెండరింగ్ లో ఎంతమేరకు సొమ్ము ఆదాయం అయ్యింది అనే అంశంపై సీఎం జగన్ కేంద్రమంత్రికి వివరించనున్నారు. 

పోలవరం రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే అంశాలపై కూడా వివరణ ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి కమిటీలు ఇచ్చిన నివేదికతోపాటు వాస్తవ పరిస్థితిని వివరించనున్నారు. 

అనంతరం కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ తో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వివాదం చెలరేగుతున్న తరుణంలో వాటికి సీఎం జగన్ వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

సోమవారం రాత్రికి ఢిల్లీలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. అనంతరం మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌‌ తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర విభజనతోపాటు కొన్ని న్యాయపరమైన సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. 

అనంతరం ఈనెల 22 సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీ నుంచి ఏపీకీ బయలుదేరతారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు. అనంతరం రాత్రి 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.