సంక్షేమ పథకాల అమలు తీరుపై బూత్ కమిటీల పరిశీలన: మైలవరం వైసీపీ నేతలతో సీఎం జగన్ భేటీ

మైలవరం  అసెంబ్లీ  నియోజకవర్గానికి  చెందిన  వైసీపీ కార్యకర్తలతో  ఏపీ సీఎం వైఎస్ జగన్  గురువారం నాడు సమావేశమయ్యారు. ఈ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతల మధ్య  విబేధాలు రచ్చకెక్కాయి.ఈ విషయాలపై  సీఎం జగన్  పార్టీ నేతలతో చర్చించారు. 

AP CM YS Jagan  meeting mylavaram  YCP leaders in Tadepally

తాడేపల్లి:  మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మూడున్నర ఏళ్లుగా  89 శాతం ఇళ్లకు రూ.  900 కోట్ల  సంక్షేమ కార్యక్రమాలను  అందించినట్టుగా  ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి  చెందిన నేతలతో  ఏపీ సీఎం వైఎస్ జగన్  గురువారం నాడు  తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  మైలవరం  ఎమ్మెల్యే వసంత  కృష్ణ ప్రసాద్ సహా  నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.  ఈ సమావేశంలో  సీఎం జగన్   పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం  చేశారు.జనవరి  నుండి బూత్ కమిటీలను నియమిస్తామన్నారు. 

బూత్ కమిటీలో ప్రతి సచివాలయాన్ని  ఒక యూనిట్ గా తీసుకుంటున్నామని ఏపీ సీఎం జగన్  తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు  పార్టీ నియమించిన గృహ సారధులు  పనిచేయాలని  సీఎం జగన్ కోరారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలు 50 ఇళ్లకు  ఏ రకంగా అందుతున్నాయనే విషయాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. 

మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్  జోక్యం చేసుకుంటున్నారని  స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్  అసంతృప్తితో  ఉన్నారు. ఈ విషయమై గత మాసంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి  మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. మైలవరం నియోజకవర్గంలో చోటు చేసుకున్న సమస్యలపై మంత్రి జోగి రమేష్,  స్థానిక ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తో  సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. నియోజకవర్గంలో  చోటు  చేసుకున్న సమస్యను సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు.  దీంతో ఇవాళ నియోజకవర్గానికి చెందిన  పార్టీ నేతలతో  సీఎం జగన్ సమావేశమయ్యారు.  ఎన్నికలకు మరో ఏడాది పాటే సమయం ఉన్నందున పార్టీ శ్రేణులు సమిష్టిగా  పనిచేయాలని సీఎం సూచించారు. నేతల మధ్య సమన్వయలోపం లేకుండా చూసుకోవాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో  రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో  జగన్  వ్యూహ రచన చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో విజయం సాధించాలంటే  అన్ని నియోజకవర్గాల్లో  నేతల మధ్య  సమన్వయం  ఉండాల్సిన అవసరాన్ని పార్టీ నాయకత్వం  క్షేత్రస్థాయి నేతలకు నొక్కి చెబుతుంది.  మైలవరం నేతలకు కూడా సీఎం జగన్  ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు.

ఇప్పటివరకు  గత ఎన్నికల్లో  టీడీపీ విజయం సాధించిన  అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన  వైసీపీ నేతలతో  సీఎం జగన్  సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం  వైసీపీ  అభ్యర్ధులు విజయం సాధించిన  నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం కోసం  ఏపీ  సీఎం వైఎస్ జగన్  ప్రయత్నిస్తున్నారు
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios