ఏపీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోగులు భారీగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, ఇతర మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశమై పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.

వ్యాక్సిన్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత నుంచి బయటపడేందుకు వున్న అవకాశాలపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టారు. శుక్రవారం మంత్రులతో కీలక సమావేశంలో వుండగానే.. భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణా ఎల్లా, హెటెరో డ్రగ్స్‌ ఎండీ పార్థసారథికి సీఎం జగన్ ఫోన్ చేశారు. ఏపీ అవసరాలు తీర్చే విధంగా అదనపు కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లతో పాటు, రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 

Also Read:ఏపీలో కరోనా విలయతాండవం: 10 వేలు దాటిన కేసులు.. చిత్తూరు, సిక్కోలులో బీభత్సం

అంతకుముందు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గురువారం మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీ వివరాలను సీఎం జగన్‌కు మంత్రులు వివరించారు. ఆక్సిజన్ సప్లై, రెమిడిసివేర్, బెడ్స్ తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేలల్లోనే నమోదవుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఏపీలో నిన్న 10 వేలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి.