ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ నిధుల విడుదలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. మొత్తం ఏడు పేజీల లేఖలో.. పోలవరం నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా సీఎం విజ్ఞప్తి చేశారు.

ఇరిగేషన్, భూసేకరణ, పునరావాసాలకు కూడా నిధులు ఇవ్వాలని జగన్ కోరారు. 2014 ఏప్రిల్ 29న కేబినెట్ చేసిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి లేఖలో ప్రస్తావించారు. ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతుందని జగన్ అన్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాకు వివరించారు. పోలవరం కట్టాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని చెప్పారని అనిల్ ప్రస్తావించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి దాకా ఖర్చు పెట్టిన నిధులను తిరిగి చెల్లించవలసిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. 2014 నుంచి 2016 సెప్టెంబర్ వరకు జరిగిన ఆరు పీపీఏ సమావేశాల్లో రివైజ్ ఎస్టిమేషన్‌ను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదని మంత్రి ఎద్దేవా చేశారు.

ప్యాకేజ్ ఇస్తున్నారని సంబరపడిపోయారని ఆయన మండిపడ్డారు. ఎన్డీఏతో కొన్నేళ్లు కలిసి వున్నారని, ఇద్దరు కేంద్రంలో మంత్రులుగా వున్నారని అనిల్ కుమార్ గుర్తుచేశారు.

చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. 2017లో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఏం జరిగిందో టీడీపీ నేతలు ఎందుకు బయటపెట్టరన మంత్రి ప్రశ్నించారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.