ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్: అమిత్ షా తో నేడు భేటీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు ఢిల్లీకి బయలుదేరారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పలువురు మంత్రులను కలుస్తారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు ఢిల్లీకి బయలుదేరారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పలువురు మంత్రులను కలుస్తారు. ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి ప్రత్యేక విమానంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు, విభజన హామీలతో పాటు కేంద్రం నుండి రావాల్సిన బకాయిలపై జగన్ కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్ తో పాటు, ప్రకాష్ జవదేకర్ లను కూడ జగన్ కలిసే అవకాశం ఉంది. పోలవరం బకాయిల విషయమై గజేంద్ర షెకావత్ తో ఆయన చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయమై చర్చించేందుకు ప్రకాష్ జవదేకర్ తో ఆయన చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
also read:రేపు ఢిల్లీకి వైఎస్ జగన్: అమిత్‌షా సహా పలువురు మంత్రులతో భేటీకి ఛాన్స్
గత వారంలోనే జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ పర్యటన రద్దైంది. పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ఫిక్స్ కావడంతో జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారని అధికారవర్గాలు తెలిపారు. రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ తర్వాత తొలిసారిగా జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. రఘురామకృష్ణంరాజు జగన్ సర్కార్ పై తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. దీంతో జగన్ పర్యటనపై రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. బుధవారం నాడు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను రఘురామకృష్ణంరాజు కలిసి పోలవరంపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.