అమరావతి:తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఏడాదిగా తాము చేపట్టిన కార్యక్రమాలను చూస్తే ఈ విషయం అర్ధమౌతోందన్నారాయన.

వైఎస్ఆర్ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నాడు అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు.

వ్యవసాయ రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీలేని రుణాలు అందించామన్నారు. వైఎస్ఆర్ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులకు వడ్డీలను చెల్లించలేదని జగన్ విమర్శించారు.

గత ప్రభుత్వం రైతులకు తూతూ మంత్రంగా రైతులకు చెల్లింపులు చేసిందన్నారు. చెరుకు రైతుల బకాయిలను కూడ చెల్లిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. 

రైతు భరోసా కింద పంటల సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయం అందించినట్టుగా ఆయన తెలిపారు. ఇప్పటికే రైతులకు రూ. 10 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టుగా సీఎం  చెప్పారు.గత ప్రభుత్వం పంటల బీమా చెల్లించకుండా వెళ్తే తాము ఆ బకాయిలను చెల్లించామని ఆయన తెలిపారు. 

రబీనాటికి పగటిపూట రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన కరెంట్ అందించామన్నారు. అక్వా రైతులకు యూనిట్ కరెంట్ ను రూ. 1.50లకే అందిస్తున్నామని సీఎం తెలిపారు.ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబానికి రూ. 7 లక్షలు చెల్లిస్తున్నట్టుగా  జగన్ చెప్పారు. 

 టీడీపీ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను సీఎం విడుదల చేశారు. ఇప్పటికే వడ్డీలేని రుణాల కోసం 96.50 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

 టీడీపీ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు కింద చెల్లించాల్సి బకాయిల మొత్తం 1150 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 54.6 కోట్ల పాత బకాయిలను ఇవాళ సీఎం జగన్ విడుదల చేశారు.