నెల్లూరు: ఒక రైతుబిడ్డగా వైయస్ఆర్ రైతుభరోసా పథకాన్ని నెల్లూరు జిల్లా వేదికగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రైతు బిడ్డగా నెల్లూరు జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. 

నెల్లూరు జిల్లాలో వైయస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులకు చెక్ లు అందజేశారు సీఎం జగన్. దేశంలో ఏ రాష్ట్రం రైతులకు ఇవ్వని విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తన పాదయాత్రలో రైతుల కష్టాలు ఉన్నామని వారి బాధలు కళ్లారా చూశానని తెలిపారు. 

గ్రామగ్రామాన రైతుల కష్టాలను చూశానని వారి ఆవేదనను చూసినట్లు తెలిపారు. వర్షాలు లేక కొందరు, పెట్టుబడి సాయంలేక మరికొందరు పడుతున్న ఆవేదనలను తాను చూసినట్లు తెలిపారు. బ్యాంకులు సైతం పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు ఇవ్వలేని దుస్థితిని చూశానని అలాంటి పరిస్థితి లేకుండా చూడాలన్న లక్ష్యంతోనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు సీఎం జగన్. 

ప్రతీ ఏటా రైతులకు మూడు విడతలుగా రూ.13,500 రూపాయలు చెల్లిస్తానని స్పష్టం చేశారు. 2017 జూలై 8న గుంటూరు జిల్లా మంగళగిరిలో వైయస్ఆర్ రైతు భరోసా పథకంపై ప్రకటన చేసినట్లు తెలిపారు. ఇచ్చిన హామీలో భాగంగా వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

వైయస్ఆర్ రైతు భరోసా పథకం ప్రకటించిన తర్వాతే తాను పాదయాత్ర చేపట్టినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 70శాతం మందికి ఒక హెక్టారుకు కూడా భూమిలేదని అలాగే 50 శాతం మంది రైతులకు అరహెక్టార్ లోపే భూమి ఉందన్నారు. 

ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతీ అడుగులోనూ రైతుకు భరోసా కల్పించినట్లు తెలిపారు. అందువల్లే ఆనాడు ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. 

వ్యవసాయ కమిషన్ లోని సభ్యులు, ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు చెప్పిన దానికన్నా 8 నెలలు కన్నా ముందుగానే రైతు భరోసా పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. రాబోయే సంవత్సరంలో ఖరీఫ్ పంట వేసే సరికి మేనెలలోనే రూ.7,500 అలాగే అక్టోబర్ లో రూ.4వేలు అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా రూ.2000 ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 

వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన దానికంటే 8 నెలలు ముందుగానే అమలు చేస్తున్నామని అలాగే రూ.12,500 కాకుండా రూ.13,500 ఇస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లకు ఇస్తామని చెప్పిన రూ.50వేల రూపాయలను రూ.67,500కు పెంచుకుంటూ పోతున్నట్లు తెలిపారు. 

భూములు లేకుండా కౌలు వ్యవసాయం చేసే ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలకు సాయం అందించాలనే లక్ష్యంతో నగదును అందజేస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అందజేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 

ఈ ఏడాదికి అక్షరాలు 43లక్ష మంది రైతులను గత ప్రభుత్వం సాధికారిక సర్వేలో రైతులుగా తేల్చిందని చెప్పుకొచ్చారు. అయితే తాము సర్వే చేసి 51 లక్షల మంది రైతులకి వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అందజేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.   

3 లక్షల మంది కౌలు రైతులకు సైతం వైయస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500 రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.2వేలు అందించినట్లు చెప్పుకొచ్చారు. ఈరోజే 9 వేల రూపాయలు 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం అందించనున్నట్లు చెప్పుకొచ్చారు సీఎం జగన్.