పాల సేకరణలో నవ శకానికి నాది పలికింది ఆంధ్రప్రదేశ్‌. అమూల్ ప్రాజెక్టును ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ... అక్కాచెల్లెళ్లకు జీవితాంతం మంచి ఆదాయం రావాలనే ఉద్దేశంతోనే అమూల్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లోని 400 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని మొదలుపెడుతున్నట్లు జగన్ పేర్కొన్నారు. దీనిని త్వరలోనే 9,899 గ్రామాలకు విస్తరిస్తామని.. 13 జిల్లాల్లో ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ కార్యక్రమం విస్తరించబడుతుంది.

పాల సేకరణ తర్వాత కేవలం 10 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు కూడా జమ అవుతుందని, ఎక్కడా మధ్యవర్తి, కమీషన్‌లు వుండవని వెల్లడించారు. అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడాలనే ఉద్దేశ్యంతో పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వ్యాపారాలు చేసేందుకు సైతం ఆర్ధిక సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే సుంకర జాతి ఆవులు, ముర్రా గేదేలు, పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి అధిక పాల దిగుబడి ఇచ్చే పశువులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని జగన్ స్పష్టం చేశారు.

డిసెంబర్ 10న 2,49,000లకు సంబంధించిన మేకలు, గొర్రెల పంపిణీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు.  ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో భాగంగా పాల సేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చున్న విషయం తెలిసిందే.

ఈనెల 5వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు లక్ష యూనిట్లు, అలాగే వచ్చే ఏడాది ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరిల మధ్య 3.64 లక్షల పాడి పశువుల యూనిట్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.