తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై వైసీపీ అధినేత, సీఎం జగన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన కీలక నేతలు, సీనియర్ మంత్రులతో జగన్ సమావేశం అయ్యారు. తొలుత దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వాలని జగన్ భావించారు.

అయితే దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులు పోటీ చేసేందుకు విముఖత చూపారు. దీంతో కొత్త అభ్యర్థిని ప్రకటించాలని వైసీపీ అధినేత నిర్ణయించారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో జగన్ సుధీర్ఘంగా చర్చిస్తున్నారు.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో తిరుపతి లోక్ సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఖాళీగా ఉన్న తిరుపతి ఎంపీ సీటును ఎన్నికల సంఘం నోటిఫై చేసినప్పటికీ, ఇంకా ఉప ఎన్నికకు సంబంధించిన ప్రకటన రాలేదు.

ఈలోపు పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో మునిగిపోగా.. టీడీపీ మాత్రం పేరును ఖరారు చేసి ఎన్నికలను రసవత్తరంగా మార్చింది. అందరికన్నా ముందుగా టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించింది.

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. కాగా, 2019 ఎన్నిక‌ల్లోనూ టీడీపీ త‌రపున పోటీ చేసి ఓడిపోయారు ప‌న‌బాక ల‌క్ష్మి.