9 నెలల్లోనే ఎన్నికలు, సిద్ధం కండి: మంత్రులతో వైఎస్ జగన్
ఎన్నికలకు సిద్దం కావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రులకు సూచించారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారు.
అమరావతి: ఎన్నికలకు సిద్దం కావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రులకు సూచించారు.ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం నాడు జరిగింది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అధికారులు వెళ్లిపోయాక రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం జగన్ చర్చించారు.మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఏపీ సీఎం జగన్ చెప్పారు
. జగనన్న సురక్ష క్యాంపెయిన్ ను పర్యవేక్షించాలని సీఎం జగన్ మంత్రులను ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వంపై మంత్రులు పర్యవేక్షించాలన్నారు.తాము ఇంచార్జులుగా ఉన్న జిల్లాల్లో కూడ మంత్రులు ఫోకస్ చేయాలని కూడ సీఎం జగన్ మంత్రులను ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ప్రజల సమస్యలు ఏమిటీ, వాటి పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్యలు తీసుకోవాలని మంత్రులను సీఎం జగన్ కోరారు.2024 ఏప్రిల్ లేదా మే మాసాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. రెండో విడత యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మరో వైపు వైసీపీ కూడ ఎన్నికలకు సిద్దమౌతుంది.వైసీపీకి చెందిన రీజినల్ కో ఆర్ఢినేటర్లు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరో వైపు ఇంచార్జీలు లేని సెగ్మెంట్లకు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంచార్జీలను నియమిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో కూడ ఎన్నికలకు బీజేపీ సన్నద్దమౌతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆయన స్థానంలో పురంధేశ్వరిని నియమించింది.
వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలు కూటమిగా పోటీ చేసే అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ఈ కూటమిలో టీడీపీ,జనసేలు ఉండే అవకాశం ఉందనే రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుంది.ఈ విషయాన్ని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది.