Asianet News TeluguAsianet News Telugu

ఏపీ వైద్య రంగంలో భారీ మార్పులు.. త్వరలో వైఎస్సార్ విలేజ్ క్లీనిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్లు : అసెంబ్లీలో జగన్

ఏపీ వైద్య రంగంలో భారీ మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు సీఎం వైఎస్ జగన్. ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లీనిక్ ఏర్పాటు చేస్తున్నామని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నామని సీఎం వెల్లడించారు. 

ap cm ys jagan key comments on health sector in state
Author
First Published Sep 20, 2022, 4:12 PM IST

వైద్య రంగంలో నాడు-నేడుతో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని సీఎం చెప్పారు. చంద్రబాబు వైద్యరంగాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్ లైటింగ్‌లో ఆపరేషన్‌లు చేయడం గతంలో చూశామని సీఎం తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నామని.. దివంగత నేత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారని జగన్ గుర్తుచేశారు. పేదలకు ఆరోగ్య భరోసా అందించేందుకు చర్యలు తీసుకున్నామని సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందని.. నెట్‌వర్క్ ఆసుపత్రుల బిల్లులను గత ప్రభుత్వం చెల్లించలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలన్నీ చెల్లించిందని సీఎం వెల్లడించారు. 

5 లక్షల లోపు ఆదాయం వున్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని.. ప్రస్తుతం 90 శాతం మంది ఆరోగ్యశ్రీ పరిధిలో వున్నారని జగన్ తెలిపారు. ఆసుపత్రుల్లో నాడు నేడు కోసం రూ.16,255 కోట్లు ఖర్చు చేశామని.. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లీనిక్ ఏర్పాటు చేస్తున్నామని... ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సలను 3,118కి పెంచామని జగన్ పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నామని.. తమ ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో 45 వేల పోస్టులను భర్తీ చేశామని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని.. మెడికల్ కాలేజీల కోసం రూ. 12,268 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. 

Also REad:నారావారిపల్లెలో స్కూల్‌ని కూడా పట్టించుకోలేదు.. వైసీపీ వచ్చాకే : చంద్రబాబుపై మండిపడ్డ జగన్‌

అంతకుముందు విద్యారంగంలో నాడు- నేడుపై జగన్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలోనూ సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు. గతంలో కార్పోరేట్ స్కూళ్లకు మేలు కలిగించేలా విధానాలు వుండేవని.. స్కూళ్లను నిర్వీర్యం చేసి, ప్రభుత్వ బడులకు వెళ్లడం అనవసరం అనేలా చేశారని జగన్ మండిపడ్డారు. బెంచీలు, మంచినీళ్లు, బ్లాక్‌బోర్డులు వుండేవి కావని సీఎం అన్నారు. డ్రాపౌట్ రేటు పెరుగుతున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లెలో స్కూలు ఎలా వుందో చూడాలంటూ జగన్ చూపించారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఆ స్కూల్‌ని మార్చేశామని సీఎం తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకుండా ఎందుకు వదిలేశారని జగన్ ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ విద్య వైపు అడుగులేస్తోందని... పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే కుటుంబాలు మారుతాయని సీఎం పేర్కొన్నారు. అందుకే నాడు- నేడు ద్వారా స్కూళ్లపై ఫోకస్ పెట్టామని.. మొత్తం 57 వేల స్కూళ్లు, హాస్టళ్ల రూపు రేఖలు మార్చబోతున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి 15 వేలకి పైగా స్కూళ్లలో డిజిటలైజేషన్ చేస్తామని.. ఉన్నత విద్యను హక్కుగా మార్చామని జగన్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios