అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాలు పథకానికి సహకరించాల్సిందిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ను కోరారు సీఎం వైయస్ జగన్. రాష్ట్రంలో నిరక్ష్యరాస్యతను జీరో స్థాయికి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ కొనియాడారు. అందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.  

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44వేల పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు జగన్ తెలిపారు. మొదటి దశలో 15వేల పాఠశాలల్లో 9 రకాల కనీస సదుపాయలను కల్పిస్తున్నట్లు జగన్ వివరించారు. 

వచ్చేఏడాది నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు,  ఆతర్వాత 9, 10 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. 

జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకాన్ని రూపకల్పన చేస్తున్నట్లు వైయస్ జగన్ స్పష్టం చేశారు. ఏడాదికి ప్రతీ విద్యార్థి తల్లికి రూ.15 వేలు అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రక్తహీనత అధికంగా ఉందని, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ప్రతీఇంటికి పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు వాటర్ గ్రిడ్ ను తీసుకువస్తున్నట్లు తెలిపారు.  

అంగన్‌వాడీలు, మధ్యాహ్నా భోజన పథకం కింద పంపిణీ చేస్తున్న ఆహారంలో నాణ్యతను పెంచి విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చినట్లు జగన్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు వివరించారు.  

అమ్మ ఒడి పథకానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పాన్సర్ చేస్తే ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని దాని కోసం ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని జబ్బులను చేర్చినట్లు తెలిపారు. 

ప్రభుత్వ ఆసుపత్రిలన్నింటిని జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. నాడు-నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించినట్లు సీఎం జగన్ వివరించారు.   

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ విజన్ ,ఆలోచన సూపర్: ప్రశంసించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్