నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యాధికారం కోసం ముఖ్యమంత్రిని కాలేదని ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని స్పష్టం చేశారు. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ ప్రాంగణంలో వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రజాసంకల్పయాత్రలో తాను ప్రజల కష్టాలను తెలుసుకున్నానని ప్రతీ అడుగులో వారితో మమేకమైనట్లు చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఒక రైతు బిడ్డగా నెల్లూరు జిల్లాకు వచ్చానని రైతులకు మంచి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. 

ఏనాడు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే పరిస్థితి రాదన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తాను పనిచేస్తానని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని వారిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. 

నెల్లూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మీ బిడ్డగా తనను ఆదరించి ఆశీర్వదించాలంటూ సీఎం జగన్ నెల్లూరు జిల్లా ప్రజలను కోరారు. 

తాను ముఖ్యమంత్రి అయ్యింది పదవుల కోసం కాదని ప్రజలకు సేవ చేసుందుకు అని మంచి ప్రజా సేవకుడిని అని నిరూపించుకునేందుకు అన్నారు. ప్రజలు చక్కటి అవకాశం ఇచ్చారని వారి రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తానని సీఎం జగన్ అన్నారు.