పోలవరం ప్రాజెక్ట్‌లో ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. గోదావరి వరద నేపథ్యంలో శుక్రవారం ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ వద్ద ప్రమాదకర పరిస్ధితులు ఏర్పాడ్డాయన్నారు. ఇప్పటికే లోయర్ కాఫర్ డ్యామ్ మునిగిపోయిందని... 28 లక్షల క్యూసెక్కుల వరకే ఎగువ కాఫర్ డ్యామ్ తట్టుకోగలదని అంబటి తెలిపారు. రేపటికి 30 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం వుందని ఆయన వెల్లడించారు. ముందస్తు చర్యల్లో భాగంగానే ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని నిర్ణయించినట్లు అంబటి రాంబాబు తెలిపారు.
అంతకుముందు గోదావరి వరద ముందు ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. భద్రాచలం దిగువన గోదావరి మరింత పోటెత్తిన పరిస్థితి నెలకొంది పోలవరంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితిని సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం రాజమండ్రిలో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు . ఈ సందర్భంగా ముంపు గ్రామాల్లో తీసుకున్న చర్యలతో పాటు రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ALso REad:వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే: రాజమండ్రిలో అధికారులతో సమీక్ష
వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల నుండి ఇంటికి వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి రెండు వేలు చెల్లించాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. గోదావరి నదికి వరద పోటెత్తడంతో గోదావరి పరివాహక ప్రాంతంలోని సుమారు 554 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
