Asianet News TeluguAsianet News Telugu

జగన్ మరో గుడ్‌న్యూస్: రేపు 47వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు

అసెంబ్లీ సాక్షిగా గత ఏడాది డిసెంబరు 17న ఈ ప్రకటన చేసిన సీఎం వైయస్‌ జగన్, ఇప్పుడు దాన్ని కార్యరూపం దాల్చేలా చేశారు. అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌) ఏర్పాటవుతోంది

ap cm ys jagan good news for out sourcing employees
Author
Amaravathi, First Published Jul 2, 2020, 3:37 PM IST

ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో లంచాలు తీసుకోవడం, ఉద్యోగంకోసం లంచాలు.. తర్వాత జీతాలు ఇవ్వాలి అంటే మాకింత ఇస్తేనే అని చెప్పి అక్కడా లంచాలు.. ఇటువంటి పరిస్థితిలో టోటల్‌గా ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అంతా కూడా నష్టపోతున్నారు’. 

‘ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకువస్తూ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగే విధంగా, ఆ ఉద్యోగుల కోసం ప్రభుత్వమే స్వయంగా ఒక ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీగా ఏర్పడి, నేరుగా వారికి సేవలందించేందుకు, వారి జీతాలు ఏ మాత్రం తగ్గకుండా వారికే మొత్తం అందేలా చూడడం కోసం, ఎక్కడా కూడా లంచాలు అనే పరిస్థితి రాకుండా ఉండడం కోసం.. ఆంధ్రప్రదేశ్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం’..

అసెంబ్లీ సాక్షిగా గత ఏడాది డిసెంబరు 17న ఈ ప్రకటన చేసిన సీఎం వైయస్‌ జగన్, ఇప్పుడు దాన్ని కార్యరూపం దాల్చేలా చేశారు. అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌) ఏర్పాటవుతోంది. 

శుక్రవారం ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో జరిగే  ప్రత్యేక కార్యక్రమంలో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆప్కాస్‌ ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారితో మాట్లాడతారు. ఈ సందర్భంగా 47 వేల మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ జారీ చేయనున్నారు.

కార్పొరేషన్‌ లక్ష్యం:
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు పూర్తిగా చెల్లించడంతో పాటు, ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేయడం. ఇంకా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, వాటన్నింటిలో మహిళలకు 50 శాతం ఇవ్వడం కూడా ఆప్కాస్‌ లక్ష్యం. 

ఆప్కాస్‌ ప్రధాన విధులు:
– పూర్తి పారదర్శక విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌ స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌ గుర్తింపు.  
– వివిధ శాఖలు, సంస్థల అవసరాలు తీర్చే విధంగా పూర్తి శాస్త్రీయ కోణంలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది ఎంపిక.
– ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా ఆ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందేలా చూడడం.
– చట్టబద్ధంగా వారికి ఉన్న సదుపాయాలు.. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)తో పాటు, ఈఎస్‌ఐ వంటివి అందేలా చేయడం.
– హౌజ్‌ కీపింగ్, సెక్యూరిటీ, కేటరింగ్, వాహనాల అద్దె వంటి కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలను గుర్తించి, వారి అవసరాల మేరకు ఉద్యోగులను ఆప్కాస్‌ ద్వారా అందించండి. 
– రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు, కార్యాలయాల్లో అవసరమైన ఔట్‌ సోర్సింగ్‌ ప్రక్రియలన్నింటికీ ‘వన్‌–స్టాప్‌–షాప్‌’ గా ఆప్కాస్‌ పని చేస్తు్తంది.

100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ:

ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా ఈ కార్పొరేషన్‌ పని చేస్తుంది. ఇది నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ సంస్థ.

ఆప్కాస్‌లో ఎవరెవరు?:

ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌కు ఛైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. ఒక మేనేజింగ్, మరొక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో పాటు, ఆరుగురు డైరెక్టర్లు ఉంటారు. 

ఆర్థిక శాఖకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి, ఏపీ హెచ్‌ఆర్‌డీ సంస్థ డీజీ, న్యాయ శాఖ కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్‌తో పాటు, మానవ వనరుల రంగానికి చెందిన ఇద్దరు నిపుణులు ఈ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. కార్పొరేషన్‌కు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తారు.

కార్పొరేషన్‌తో ప్రయోజనాలు:
– ప్రైవేటు ఔట్‌ సోర్సింగ్‌ సంస్థలు, దళారులు తొలగిపోతారు.
– అవినీతి లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకం.
– వాటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఉద్యోగాలు, మళ్లీ వాటిలో మహిళలకు 50 శాతం ఉద్యోగాలు.
– ఎలాంటి కోతలు లేకుండా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందికి ఠంచనుగా నెల నెలా పూర్తి వేతనాల చెల్లింపు.
– ఉద్యోగులకు ఉన్న సదుపాయాలు.. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి అందుతాయి.
– పారదర్శకంగా ఏ విధమైన కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా ఉద్యోగుల నియామకం.

* ఔట్‌ సోర్స్‌డ్‌ మ్యాన్‌పవర్‌ – మార్గదర్శకాలు:

– ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందిని కార్పొరేషన్‌ పరిధిలోకి మారుస్తారు.
– ఇక నుంచి కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ ఆప్కాస్‌ మాత్రమే ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
– ఇప్పుడు ఔట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని తొలగించరు.
– ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా ఒక యూనిక్‌ కోడ్‌ ఇస్తారు.
– రిజర్వేషన్ల ప్రక్రియను పక్కాగా అమలు చేస్తారు.
– కార్పొరేషన్‌ పరిధిలోకి ఆయా ఉద్యోగులను బదలాయించే సమయంలో వారి పే స్లిప్‌లు, బ్యాంక్‌ ఖాతాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐకి సంబంధించిన ఖాతాల వివరాలు సేకరిస్తారు.
– కార్పొరేషన్‌ పరి«ధిలోకి ఆయా ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సమీక్షించడానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.
– ఆ కమిటీకి జిల్లా కలెక్టర్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గానూ, ఆ సంస్థల నుంచి ఒక ప్రతినిధి కమిటీ మెంబర్‌గా ఉంటారు.
– ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలు, మైనారిటీలకు 29 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు. వాటన్నింటిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. 
– ఈ రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షిస్తాయి.
– అవసరమైతే కొత్త అభ్యర్థులను కూడా జిల్లా స్థాయి కమిటీలు సూచిస్తాయి. వారి పేర్లను కార్పొరేషన్‌ ఆప్కాస్‌కు పంపాల్సి ఉంటుంది.

వేతనాల చెల్లింపు:
–ఆప్కాస్‌కు కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది బదలాయింపు తర్వాత వారి వేతనాలన్నీ ఆ కార్పొరేషన్‌ ద్వారానే చెల్లిస్తారు.
–అంతే కానీ, ఆయా శాఖలు, విభాగాలు సంస్థలు, కార్యాలయాలు నేరుగా ఆ ఉద్యోగులకు వేతనాలు చెల్లించవు.
–ఉద్యోగులు, సిబ్బందిని నియమించుకున్న సంస్థలు, శాఖలు, విభాగాలు, కార్యాలయాలు ప్రతి నెలా ఆ మేరకు వారి వేతనాలు, ఇతర సదుపాయాలకు సంబంధించిన బిల్లులను ఏపీసీఓఎస్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
–ఆ మేరకు ఆయా శాఖలు, సంస్థలు, కార్యాలయాల నుంచి కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన విధుల నిర్వహణ సర్టిఫికెట్, వేతనాల మొత్తం సేకరించిన తర్వాత ఆప్కాస్‌ నేరుగా వారికి ప్రతి నెలా వేతనాలు చెల్లిస్తుంది.
–అదే విధంగా వారికి సంబంధించిన ఈపీఎఫ్, ఈఎస్‌ఐ ఖాతాల్లో నగదు జమ చేస్తుంది.

– పూర్తి పారదర్శకంగా సాగే ఈ విధానం వల్ల ఎక్కడా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది వేతనాల్లో కోత పడదు. అవినీతికి తావుండదు. ప్రైవేటు ఏజెన్సీలు, దళారీలు తొలగిపోతారు కాబట్టి, లంచాలు, కమిషన్లకు అవకాశమే ఉండదు

Follow Us:
Download App:
  • android
  • ios