అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనపై దృష్టిసారిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక అంశాలపై కుపీ లాగుతున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన వైయస్ జగన్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయదలచిని మెడ్ టెక్ జోన్ ఏర్పాటుపై ఆరా తీశారు. 

వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే మెడ్ టెక్ జోన్ పై ఆరోపణలతో ప్రాజెక్టును పక్కన పెట్టిన ప్రభుత్వం. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చెందిన ప్రాజెక్టు ఇదేనా అంటూ వైయస్ జగన్ ఆరా తీశారు. 

మెడ్ టెక్ జోన్ పై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని పూనం మాలకొండయ్యను ఆదేశించారు. గతంలో మెడ్ టెక్ జోన్ టెండర్ల విషయంలో వందల కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన అంశంపై అడిగి తెలుసుకున్నారు. 

మెడ్ టెక్ జోన్ టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ ఆనాడు ఆరోపించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇతరులపై కేసులు సైతం పెట్టింది. అయితే పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటుందనే సమయానికి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది గత ప్రభుత్వం.