వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు చదువులో రాణిస్తున్నారు. జగన్ పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డికి పారిస్‌లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూళ్లో సీటు దక్కింది.

ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షిణీ రెడ్డి పారిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదవనున్నారు.

దీంతో కుమార్తెను పారిస్ పంపేందుకు గాను మంగళవారం నాడు ముఖ్యమంత్రి బెంగళూరు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి విమానంలో హర్షిణి రెడ్డిని పారిస్ పంపించనున్నారు.

మరోవైపు జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి అమెరికాలోని ఇండియానా స్టేట్‌లో ఉన్న ప్రతిష్టాత్మక నోట్రే డామ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదవుతోంది.

కాగా ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్‌లో ఒకటైన ఇన్సీడ్ బిజినెస్ స్కూళ్లో తమ అధినేత కుమార్తె సీటు సాధించడంపై వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా జగన్‌కు, హర్షిణి రెడ్డికి అభినందనలు తెలుపుతున్నారు.