అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కరోనా వైరస్ తాకింది. సచివాలయంలోని 3, 4 బ్లాకుల్లోకి ఎంట్రీని నిషేదిచారు.సచివాలయం మొత్తాన్ని సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు.  3,4 బ్లాకుల్లో పని చేసే సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు.మిగతా బ్లాకుల్లోనూ అంతంత మాత్రంగానే ఉద్యోగుల హాజరు నమోదైంది.

సచివాలయంలోని ఇద్దరు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. సచివాలయానికి కరోనా తాకిడితో  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన రివ్యూలను విజయవాడ ఆర్ అండ్ బి భననంలోని ఏపీటీఎస్ కార్యాలయానికి మార్చుకున్నారు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్క రోజులోనే 105 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో రాష్ట్రానికి చెందినవారు 76 మంది ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 28 మంది ఉన్నారు. కొత్తగా గత 24 గంటల్లో మరో రెండు మరణాలు సంభవించాయి. 10,567 శాంపిల్స్ ను పరీక్షించగా 76 మందికి కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 34 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. కోయంబేడుకు చెందిన కేసులు 9 ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 3118కి చేరుకుంది. ఇందులో 2169 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 885 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాలు 64కు చేరుకున్నాయి. 

విదేశాల నుంచి వారిలో 112 మంది కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మొత్తం కేసులు కూడా యాక్టివ్ గానే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 446 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో 249 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.