ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలతో కలిపి మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఒక్కో హెల్త్ హబ్‌కు 30-50 ఎకరాలు సేకరించాలని.. హెల్త్ హబ్‌లో ఒక్కో ఆసుపత్రికి 5 ఎకరాలు కేటాయించాలని జగన్ సూచించారు. మూడేళ్లలో కనీసం 100 కోట్లు పెట్టబడి పెట్టే ఆసుపత్రులకు భూములు కేటాయించాలని సీఎం ఆదేశించారు. 

హెల్త్ హబ్‌ల వల్ల ఏపీకి 80 మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తరపున కొత్తగా 16 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇకపై వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం వుండదని జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు మంచి ప్రమాణాలతో వైద్యం అందిస్తామని..  నెలరోజుల్లోగా ఈ పాలసీని తీసుకురావాలని అధికారులను జగన్ ఆదేశించారు. 

అంతకుముందు రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనాతో పాటు ఆనందయ్య మందు పంపిణీపైనా ఈ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రివ్యూలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆయుష్ కమీషనర్ రాములు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కంటైన్మెంట్ విధానాన్ని జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో దీనిపైనా జగన్ చర్చిస్తున్నారు. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో కర్ఫ్యూపై ప్రభుత్వం సారించింది. 

Also Read:పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి: జగన్

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 14,429 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,57,986కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,634కి చేరుకుంది.