అమరావతి: ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా పనిచేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు సూచించారు.  ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య సవన్వయం కోసం సీఎం జగన్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

మంగళవారం నాడు రాత్రి విజయవాడ బెరం పార్కులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు విందు ఇచ్చారు. అవినీతి తప్ప అన్ని అంశాల్లో పాలు నీళ్లలా కలిసి పనిచేయాలని సీఎం జగన్ కోరారు. 

అవినీతి తప్ప అన్ని అంశాల్లో కలిసి మెలిసి పనిచేయాలని సీఎం హితవు పలికారు. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సఖ్యతతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు.

ముమ్మరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను  ప్రజలకు చేరాలంటే ప్రజాప్రతినిధులు, అధికారవర్గాలు దగ్గరగా పనిచేయాలని ఆయన సూచించారు.

అహంభావంతో పని చేయకూడదని సీఎం జగన్ అధికారులను కోరారు. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని ఆయన కోరారు. జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని జగన్ సలహా ఇచ్చారు.

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా అధికారులు తోడుగా ఉంటారని జగన్ ఈ సమావేశంలో చెప్పారు.అధికారులు, ప్రజాప్రతినిధులు తరుచుగా కలుసుకుని సమావేశాలు జరుపుకోవడంవల్ల మంచి వాతావరణం ఏర్పడుతుందన్నారు.

జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెడతాయన్నారు. జనవరి నుంచి ఎమ్మల్యేలు, అధికారులు గ్రామాల బాట పట్టాలి
ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు గ్రామ సచివాలయాలు ఎలా పనిచేస్తున్నాయో చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.

వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందో పరిశీలించాల్సిందిగా కోరారు. వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జాబితాలో పేరు లేకపోతే ఎవరికి, ఎలా దరఖాస్తు చేయాలో అందులో పొందుపరచమన్నామన్నారు. ఈ విషయాలన్నీ ఉన్నాయో లేవో కూడ పరిశీలించాలని జగన్ కోరారు.

మనకు ఓటు వేయని వారు కూడా అర్హుడైతే తప్పకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించాలని చెప్పారు. ఇవన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూడాలన్నారు. 

దాదాపు 2 లక్షలమంది ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేను ఎన్నుకుంటారన్నారు.ప్రజా సమస్యలపై వారు ఫోన్లు చేసినప్పుడు అధికారులు స్పందించాలని సీఎం ఆదేశించారు. ప్రజా ప్రతినిధుల ఫోన్లకు రెస్పాన్స్ ఉండాలని సీఎం జగన్ కోరారు. ప్రజా ప్రతినిధులు కూడ అధికారులతో సఖ్యతగా ఉండాలని సీఎం జగన్ కోరారు.