Asianet News TeluguAsianet News Telugu

రెండేళ్ల పాలనలో రైతు పక్షపాతిగానే వున్నా.. కరోనా కాలంలోనూ పెట్టుబడి సాయం: జగన్

కరోనా విపత్కర పరిస్ధితుల్లోనూ రైతులకు అండగా నిలబడ్డామని జగన్ గుర్తుచేశారు. ఈ ఒక్కరోజే రైతుల కోసం రూ.1570 కోట్లతో శంకుస్థాపనలు చేశామని సీఎం తెలిపారు. పెట్టుబడి సాయం కింద రైతన్నలకు రూ.13,500 ఇస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

ap cm ys jagan comments rbk centers in rayadurgam ksp
Author
rayadurgam, First Published Jul 8, 2021, 3:34 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. ఉడేగోళంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాన్ని జగన్ ప్రారంభించారు. అలాగే రాయదుర్గం మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రంలో మొక్కను నాటారు సీఎం. అనంతరం జగన్ మాట్లాడుతూ... రైతుల కోసం 8,675 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని వెల్లడించారు. ఆర్ధిక సవాళ్లు ఎదురవుతున్నా.. రైతుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని జగన్ పేర్కొన్నారు. జలయజ్ఞంతో రాష్ట్ర రూపు రేఖలను మార్చిన ఘనత వైఎస్ఆర్‌దేనన్నారు.

రెండేళ్లు రైతు పక్షపాతంగానే పాలన సాగించామని.. మనది రైతుపక్షపాత ప్రభుత్వం అని జగన్ స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం అన్నారు. కరోనా విపత్కర పరిస్ధితుల్లోనూ రైతులకు అండగా నిలబడ్డామని జగన్ గుర్తుచేశారు. ఈ ఒక్కరోజే రైతుల కోసం రూ.1570 కోట్లతో శంకుస్థాపనలు చేశామని సీఎం తెలిపారు. పెట్టుబడి సాయం కింద రైతన్నలకు రూ.13,500 ఇస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని సీఎం పేర్కొన్నారు.

Also Read:తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టలేదు, పెట్టం: జలవివాదంపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు

ప్రతి పంటకు ఈ క్రాపింగ్ చేయిస్తున్నామని...రెండేళ్లలో రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేశారనే వివరాలు ఆర్‌బీకేల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందని .. పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే ఆర్‌బీకేలో అమ్ముకోవచ్చని జగన్ స్పష్టం చేశారు. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశామని సీఎం గుర్తుచేశారు. విద్యార్ధులకు సీబీఎస్‌ఈ విద్యాబోధన అందిస్తున్నామన్నారు. లంచం లేకుండానే ప్రభుత్వం సేవలు అందిస్తున్నామని.. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ తీసుకొస్తామన్నారు. రైతు ఆత్మహత్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios