అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన దుర్నీతిని, దుశ్సాసన పర్వానికి స్వస్తి పలికి ప్రజల మెచ్చిన పాలన అందించాలన్నదే తమ లక్ష్యమని ఏపీ సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. 

అవినీతి రహిత పాలన అందించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల మంజూరు వంటి ప్రతీ పనిలో అవినీతి చోటు చేసుకుందన్నారు. 

వాటన్నింటికి ముగింపు పలకాలని లక్ష్యంతో నీతివంతమైన పాలన అందిస్తామన్నారు. ఇకపోతే భారీ ప్రాజెక్టుల విషయంలో జ్యుడీషయల్ కమిషన్ వేస్తున్నామని దేశ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఎక్కడా లేదన్నారు.  

పాలకులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అంతా ప్రజాసేవకులేనని చెప్పుకొచ్చారు. ఏ ఒక్కరూ కూడా అవినీతికి పాల్పడినా సహించేది లేదని చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇకపోతే ప్రతీ పనిలో పారదర్శకత అనేది తీసుకువస్తామన్నారు వైయస్ జగన్. పారదర్శక పాలనతో అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 972 కిలోమీటర్ల  మేర సముద్ర తీరం ఉందన్నారు. ఈ సముద్ర తీరంలో సహజ సంపద, వనరుల దోపిడీ జరుగుతోందని వాటిని అరికట్టి పారదర్శకత తీసుకువస్తే అభివృద్ధి అనేది కళ్లముందు కనబడుతోందన్నారు. 

ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం మరింత బాగుపడేదన్నారు. బీజేపీకి 250 సీట్లు కంటే తక్కువ వస్తే బాగుండేదని అయితే 303 సీట్లతో స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. 

ఫలితంగా కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం లేదని అది మన ఖర్మ అన్నారు. అయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంత పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. ఢిల్లీ పెద్దల మనసు కరిగే వరకు పదేపదే గుర్తు చేస్తూ హోదాను సాధిస్తానని నమ్మకం తనకు ఉందన్నారు సీఎం వైయస్ జగన్.