అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైయస్ జగన్. చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉన్నా సరే తమకు ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ ఆనాడు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని భీష్మించుకుని కూర్చున్న చంద్రబాబు నాయుడు మరి ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు అలా భీష్మించుకుని కూర్చోలేదన్నారు. 

ప్రత్యేక హోదా ఏం పాపం చేసిందని ప్రశ్నించారు.  ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు వైఖరిలో మార్పురాలేదన్నారు. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో 23 కాస్త 13 కూడా వచ్చే అవకాశం లేదన్నారు సీఎం వైయస్ జగన్. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేవుడు ఆశీస్సులు ఇచ్చారు కాబట్టే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు వైయస్ జగన్. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలన్నదే తన తాపత్రాయమన్నారు. 

తాను నడచిన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో అదే చెప్పానని అదే చేస్తానని భవిష్యత్ లో మంచి పాలన అందిస్తానని భరోసా ఇచ్చారు వైయస్ జగన్. వైయస్ జగన్ ప్రసంగానికి మాజీమంత్రి అచ్చెన్నాయుడు పదేపదే అడ్డుతగులుతుండగా స్పీకర్ వారించే ప్రయత్నం చేశారు. అచ్చెన్నాయుడు అలా అడ్డుపడుతూనే ఉంటారని వారిని పట్టించుకోవద్దని కుక్కతోక ఎప్పుడూ వంకరేనని చెప్పుకొచ్చారు వైయస్ జగన్.