అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రి వర్గ విస్తరణపై వేగం పెంచినట్లు తెలుస్తోంది. తన మంత్రివర్గంలో సీనియారిటీ, పార్టీ విధేయులు, ఆది నుంచి తన వెన్నంటి నడిచిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

మరో రెండు రోజుల్లో జగన్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఎవరెవరిని మంత్రి పదవులు వరిస్తాయి ఏయే సామాజిక వర్గాలకు కీలక పదవులు కట్టబెట్టబోతున్నారంటూ వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. 

ఈనెల 8న కేబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో జగన్ వివిధ సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు కేటాయించనున్నారని తెలుస్తోంది. జగన్ కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏడుగురికి అవకాశం కల్పిస్తారని సమాచారం. 

అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి ఆరుగురికి, కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి ఇద్దరికీ, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి ఒకరికి జగన్ తన టీంలో అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. 

వారితోపాటు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరు, క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఒకరికి ముస్లిం మైనారిటీ, బ్రహ్మణ, వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి జగన్ కేబినెట్ లో అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.