ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన గురుపూజోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం ప్రసంగిస్తూ.. గురువులందరికీ వందనాలని.. తనకు చదువు నేర్పిన గురువులకు పాదాభివందనాలు సమర్పించారు.

అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరికీ ఆదర్శమని జగన్ కొనియాడారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురువుల పట్ల ఎంతో గౌరవంగా మెలిగేవారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

గురువు వెంకటప్పయ్య పేరుతో వైఎస్ పులివెందులలో స్కూల్‌ను స్థాపించారని జగన్ తెలిపారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఇప్పటికీ ఆ స్కూలును నడుపుతోందన్నారు.  గురువులు విద్యార్ధుల మనస్సులపై ఎటువంటి ముద్ర వేయగలరన్న దానికి ఇదే నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచాలన్నది తన లక్ష్యమని జగన్ పేర్కొన్నారు. బ్రిక్స్ ఎకానమీ లెక్కల ప్రకారం కాలేజీలకు వెళుతున్న విద్యార్ధులు మనదేశంలో కేవలం 36 శాతమేనని సీఎం వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తామని.. ఇందులో తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తునట్లు తెలిపారు. ప్రతి విద్యార్ధి ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతామని జగన్ స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన గురువులకు ముఖ్యమంత్రి అవార్డులు అందజేశారు.