అమరావతి: అవినితికి, దోచుకోవడానికి ఎమ్మెల్యేలతో పాటు ఎవరూ ముందుకు వచ్చినా కూడ తమ ప్రభుత్వం ఉపేక్షించదని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎంతటి పెద్ద వాడైనా... ఏ స్థాయిలో ఉన్నా కూడ అక్రమాలకు, అవినీతికి, దోచుకోవడాన్ని ప్రోత్సహించబోమన్నారు.

సోమవారం నాడు అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్పరెన్స్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ నుండి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును ఎప్పుడూ కూడ మర్చిపోకూడదని ఆయన సూచించారు.

ఫలానా వ్యక్తి ఎమ్మెల్యే కావాలని  ప్రజలు ఓట్లేసి గెలిపించారని ఆయన చెప్పారు.  ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు వచ్చిన సమయంలో చిరునవ్వుతో వారిని  రిసీవ్ చేసుకోవాలని జగన్  సూచించారు.

ఎమ్మెల్యేలను కాన్పిడెన్స్‌లోకి తీసుకోవాలన్నారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యేలు అధికారుల దృష్టికి తీసుకొస్తారని చెప్పారు.  వాటిని పరిష్కరించాలని జగన్ కోరారు.ప్రభుత్వం, అధికారులు కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.పేదలు, బడుగు, బలహీనవర్గాలకు సంబంధించిన వారిని అధికారులు ఏనాడూ మర్చిపోకూడదని జగన్ ఆదేశించారు.

అణగారిన వర్గాలు ఆర్థికంగా బలపడేందుకు  అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేయాలని  ఆయన కోరారు.కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేరాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి: జగన్