అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ ఉన్న 17,097 పోస్టుల భర్తీకి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు తెలిపారు. జూలై నెలాఖరులో పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామని అధికారులు వివరించారు. వైద్యశాఖలో ఖాళీగా వున్న పోస్టులు, గ్రామ–వార్డు సచివాలయాల్లో పోస్టులు అన్నీ కలిపి  ఒకేసారి షెడ్యూల్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. 

గ్రామ, వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థపై సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలపై సీఎం అధికారులతో చర్చించారు. లబ్ధిదారుల జాబితా, గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన నంబర్ల జాబితా, ప్రకటించిన విధంగా నిర్ణీత కాలంలో అందే సేవల జాబితా, ఈ ఏడాదిలో అమలు చేయనున్న పథకాల క్యాలెండర్‌ను అన్ని గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచాలని సీఎం ఆదేశించారు. అలా ఉంచారా? లేదా? అన్నదానిపై ఈనెల 20లోగా జియో ట్యాగింగ్ వెరిఫికేషన్‌ పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. 

read more  బాబుకి షాక్: గత ప్రభుత్వ నిర్ణయాలపై సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ నిర్ణయం

మార్చి 2021 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సొంత భవనాల నిర్మాణం పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల  శిక్షణపై వివరాలను సీఎంకు అందించారు అధికారులు.  అలాగే వాలంటీర్లకు శిక్షణపైనా సీఎం ఆరా తీశారు. వాలంటీర్లకు సెల్‌ఫోన్లు ఇచ్చినందున డిజిటిల్‌ పద్ధతుల్లో వారికి శిక్షణ ఇచ్చే ఆలోచన చేయాలన్నారు సీఎం. అంతేకాకుండా అవగాహన చేసుకున్నారా? లేదా? అన్నదానిపై వాలంటీర్లకు ప్రశ్నావళి పంపాలన్నారు. 

పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలని సీఎం అదికారులకు సూచించారు. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలన్నారు. ప్రకటించిన సమయంలోగా సకాలానికే పథకాలు అందాలన్నారు. ఎవరి దరఖాస్తులను కూడా తిరస్కరించకూడదని...అర్హత ఉన్న వారికి పథకాలు అందకపోతే అధికారులను బాధ్యులను చేస్తానని సీఎం హెచ్చరించారు. 

పెన్షన్, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ  కార్డు, రేషన్‌ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలని... మొదట వీటిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటించనున్నట్లు... ఆ సమయంలో ఎవ్వరి నుంచి కూడా తమకు పథకాలు అందలేదని ఫిర్యాదులు రాకూడదని సీఎం జగన్ అధికారులను ముందస్తుగానే హెచ్చరించారు.