Asianet News TeluguAsianet News Telugu

ఆ తల్లులకు వెంటనే రూ.5వేలు: సీఎం జగన్ ఆదేశం

రాష్ట్రంలోని అంగన్వాడీలను మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌ సంబంధిత అధికారులకు ఆదేశించారు. 

AP CM Jagan Review Meeting on Anganvadi
Author
Amaravathi, First Published Jul 23, 2020, 9:34 PM IST

అమరావతి: డెలివరీ కాగానే మహిళలకు రూ.5వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఆరోగ్య ఆసరా కింద అందించేలా చూడాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు.  మహిళా, శిశుసంక్షేమంలో భాగంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అంగన్‌ వాడీలను మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. స్కూళ్ల తరహాలోనే  అగన్వాడీల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా 10 రకాల మౌలిక సదుపాయాలను (కిచెన్‌ షెడ్డుతో కలిపి) కల్పించాలన్నారు. అంగన్‌వాడీలు నిర్వహిస్తున్న సేవలను రెండు రకాలుగా చూడాలని... గర్భవతులను, బాలింతలు, 36 నెలలోపు శిశువుల కార్యకలాపాలను ఒక వైపు, 36 –72 నెలల వరకూ పిల్లలను మరో విధంగా చూడాల్సి ఉంటుంది.

ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ –2 లపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రాథమిక విద్యనందిస్తున్న స్కూళ్లలోనే వీరికి బోధన ఉంటే బాగుంటుందనేది ఒక ఆలోచన అని... దీన్ని క్షుణ్నంగా పరిశీలించి ఎలా అమలు చేయాలి అన్నదానిపై ఆలోచనలు చేసి 7–10 రోజుల్లోగా ప్రణాళిక రూపొందించాలన్నారు. దీనివల్ల ఈ వయస్సులో ఉన్న పిల్లల చదువులు ఒకటో తరగతికి అనుసంధానం అవుతాయన్నారు. 

read more  కరోనా సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం...నివారణకు నాలుగు 'T'లు: ఏపీ గవర్నర్

పీపీ–1, పీపీ–2 సిలబస్‌పైనా పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. పాఠ్యప్రణాళిక సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే టెక్ట్స్‌ బుక్స్‌ మార్చామని, విద్యాశాఖ అధికారులతో కూర్చొని పీపీ–1, పీపీ–2 పిల్లలకు బోధనాంశాలపైనా కూడా చర్చించి, నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంగన్‌వాడీ పిల్లల్లో లెర్నింగ్‌ స్కిల్స్‌ కోసం టూల్స్, టీవీ, ప్రత్యేక పుస్తకాలు రూపొందించాలన్నారు. 

రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 20,957 కేంద్రాలకు సొంత భవనాలు, 10,728 కేంద్రాలకు అద్దెలేని భవనాలు, 23,922 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని తెలిపారు. భవనాలు లేని వాటికి కొత్త వాటి నిర్మాణం, ఉన్న భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. 

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ కింద అందిస్తున్న ఆహారం నాణ్యంగా ఉండాలని సీఎం స్పష్టంచేశారు. అంగన్‌వాడీల్లో ఆహారం నాణ్యత ఎక్కడైనా ఒకేలా ఉండాలని, దీనికోసం స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ పాటించాలన్నారు. అంగన్‌వాడీల్లో  పరిశుభ్రతపైనా దృష్టిపెట్టాలన్నారు. వైయస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ అమలు తీరుపై బలమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కోసం పాటిస్తున్న స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌ అన్నీకూడా ఇక్కడ పాటించేలా చూడాలని సీఎం స్పష్టంచేశారు.  

అంగన్‌వాడీలను సమర్థవంతగా నిర్వహిస్తున్న వారిని పోత్సహించాలన్నారు. సరిగ్గా నిర్వహించని అంగన్‌వాడీలపై సమాచారం ఉన్నతాధికారులకు రావాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. దీనివల్ల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios