విజయవాడ: మానవ చాతుర్యం,  ఆవిష్కరణ, అనుసరణ సామర్థ్యం త్వరలో కోవిడ్-19 మహమ్మారికి పరిష్కారాన్ని చూపుతాయన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్. ఏడాది పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఆయన ఏపీ ప్రజలను ఉద్దేశించి దూరదర్శన్  ప్రసంగించారు.   

గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన  ప్రగతిశీల రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్‌గా సేవ చేసే అవకాశం లభించిందని... తనకు ఇది ఒక గర్వకారణం అని అన్నారు.  

ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కోవిడ్19 కేసులు దేశంలో తీవ్రతరం అవుతున్నాయని అన్నారు.  ఈ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కోవటానికి అధునాతన వైద్య మరియు ప్రజారోగ్య సౌకర్యాలు కలిగిన దేశాలు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నాయనిపేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నాయని, వైరస్ బారిన పడిన వారికి సకాలంలో చికిత్స సదుపాయాలు  కల్పిస్తున్నాయని గవర్నర్ వెల్లడించారు.  

కోవిడ్19 మహమ్మారి ని సమర్థవంతంగా నాలుగు  "T "ల సూత్రాన్ని అనుసరించడం ద్వారా నివారించేందుకు వీలుందన్నారు. అవి ‘ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్’అనిపేర్కొన్నారు. వైరస్ ను ఓడించడానికి నివారణే ఉత్తమ మార్గం కాబట్టి ప్రజలు వీలైనంత వరకూ ఇంట్లో ఉండాలని...ఆరోగ్య నిపుణులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన సూచించారు. 

read more   మూడు జిల్లాల్లో విశ్వరూపం: ఏపీలో ఒక్క రోజులో 8 వేలకు చేరువలో కేసులు

తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నందున భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు.  బాధిత వ్యక్తులకు చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మహమ్మారి నుంచి ప్రజలను ముందుండి కాపాడుతున్న డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది, రెడ్‌క్రాస్, ఎన్జీఓలు, పౌర సమాజ సంస్థల సేవలను గవర్నర్ హరిచందన్ ప్రశంసించారు.

వివిధ విశ్వవిద్యాలయాలు మరియు విద్యాసంస్థలు నిర్వహించిన కార్యక్రమాలకు హాజరవుతున్నప్పుడు, వారు స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు మరియు చెట్లు నాటే కార్యక్రమాన్ని  నిర్వహించడం తప్పనిసరి చేసానని గవర్నర్ అన్నారు. భారీగా చెట్ల పెంపకం ద్వారా మాత్రమే వాతావరణ మార్పుల ద్వారా ఉత్పన్నమయ్యే చెడు ప్రభావాలను ఎదుర్కోవచ్చని, కాలుష్య నివారణ  చేయవచ్చని అన్నారు.  

తన పర్యటనలో భాగంగా ఎర్ర తివాచీలు వేయడం, హోర్డింగ్‌లు,  తోరణాలు కట్టడం లాంటి బ్రిటీష్ పాలననాటి సంప్రదాయాలను పక్కనపెట్టి అనవసర వ్యయాన్ని తగ్గించాలని అధికారులకు ఆదేశించానని చెప్పారు.  శ్రీకాకుళం మరియు కర్నూలు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను సందర్శించినప్పుడు గిరిజన ప్రజలతో మమేకమై,  వారి సమస్యలను అర్థం చేసుకున్నానని ఆయన అన్నారు.  

రాష్ట్రంలోని గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించి వారి అవసరాలను తెలుసుకునే ప్రయత్నాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానని గవర్నర్  హరిచందన్ అన్నారు.  రాష్ట్ర ప్రజల సంక్షేమం మరియు అభివృద్ది కొరకు కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయడమే తన లక్ష్యమన్నారు.  గత ఏడాదిగా తనపై ప్రేమ, ఆప్యాయత చూపి చక్కటి  సహకారాన్నీ అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని గవర్నర్ తెలిపారు.