అమరావతి: వచ్చే ఏడాది నుండి సీబీఎస్ఈ సిలబస్ ను కూడ  రాష్ట్రంలో తీసుకొస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.జగనన్న వసతి దీవెన  పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం నాడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. కోవిడ్  సమయంలా కూడ సంక్షేమ పథకాలు  అందిస్తున్నామని  ఆయన గుర్తు చేశారు. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.2,270 కోట్లు సహాయం చేస్తామన్నారు. విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నారు. ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని ఆయన చెప్పారు. 

ప్రతి ఏటా రెండు వాయిదాల్లో జగనన్న వసతి దీవెన  కార్యక్రమం  కింద నగదును జమ చేస్తామని సీఎం తెలిపారు. విద్యా రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్ధి ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్ధులకు సహాయం చేస్తామని సీఎం తెలిపారు. పేద విద్యార్ధులు ఉన్నత విద్యకు దూరం కాకూడనే ఉద్దేశ్యంతో జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించామన్నారు.  నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపు రేఖల్ని మారుస్తున్నామని ఆయన గుర్తు చేశారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే  అందరికి  ఈ పథకం వర్తింపజేస్తామని ఆయన తెలిపారు.