అమరావతి: కరోనా సోకడంతో చికిత్స కోసం హాస్పిటల్లో చేరిన మాజీ రాష్ట్రపతి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలన్న దేశ ప్రజల ఆశ నెరవేరలేదు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. దేశ అత్యున్నత పదవిని అధిరోహించడమే కాకుండా కేంద్ర మంత్రిగానూ దేశానికి సేవలందించిన ఆయన మృతిచెందడంపై రాజకీయ ప్రముఖులే కాదు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులు స్పందించారు. 

ప్రణబ్ మృతిచెందినట్లు తెలియగానే ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను అత్యంత సమర్ధవంతంగా ఎదర్కొన్నారని... అలాంటి గొప్పవ్యక్తి మరణం దేశానికే తీరని లోటని అన్నారు. రాష్ట్రపతి, కేంద్రమంత్రిగా ఆయన దేశానికి ఎన్నో సేవలు చేశారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని జగన్ పేర్కొన్నారు. 

 ప్రణబ్ తో కేసీఆర్ అనుబంధం (ఫొటోలు)

ఇక ''మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి విచారకరం. దేశం నేడు అసాధారణమైన రాజనీతిజ్ఞులు, మాస్టర్ స్ట్రాటజిస్ట్ మరియు హుందాతనం, క్రమశిక్షణ అనే వాటిని ఎప్పుడూ తనవెంట వుంచుకునే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తిని కోల్పోయింది. ఆయనకుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను'' అంటూ ప్రణబ్ మృతిపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.