అమరావతి: గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్లో అవినీతిని వెలికి తీసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఏయే విభాగాల్లో  అక్రమాలు చోటు చేసుకొన్నాయో తవ్వేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని  నిర్ణయం తీసుకొన్నారు ఏపీ  సీఎం వైఎస్ జగన్ . గత ప్రభుత్వ నిర్ణయాల్లో అక్రమాలు తేలితే  చంద్రబాబు సహా మంత్రులపై కేసులు పెట్టాలని సీఎం ఆదేశించారు. 

బుధవారం నాడు విద్యుత్ సంస్థపై ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో   విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్ష నిర్వహించారు సీఎం.

గత ప్రభుత్వం అవలంభించిన విధానాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్  సమీక్షించారు.సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లలో ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం వాటిల్లిందని  అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.  

నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం నుండి డబ్బులు పొందిన ప్రైవేట్ కంపెనీల నుండి డబ్బులను వసూలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకొన్నారు.విద్యుత్ కంపెనీలతో సంప్రదింపులతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రైవేట్ విద్యుత్ కంపెనీల నుండి రూ.2636 కోట్లను రికవరీ చేయాల్సిందేనని జగన్  ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హాయంలో తీసుకొన్న నిర్ణయాల్లో అక్రమాలు తేలితే  బాధ్యులైన మంత్రులతో పాటు మాజీ సీఎం చంద్రబాబుపై కూడ కేసులు పెట్టాలని జగన్ అధికారులకు స్పష్టం చేశారు.

మరో వైపు గత ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో  అవినీతిని వెలికితీసేందుకు  కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. 30 అంశాలపై  కేబినెట్ సబ్ కమిటీ దృష్టి కేంద్రీకరించనుంది. ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల సహకారం కూడ తీసుకోవాలని  జగన్  ఆదేశించారు.