గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘లీటరు పెట్రోలు వంద రూపాయలు చేసేస్తారేమో. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనమవుతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆర్థిక వ్యవస్థ ఇంతకన్నా మెరుగ్గానే ఉండేది’ అంటూ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నోట్లు రద్దు చేసేటప్పుడు ప్రభావాలు ఆలోచించాలి కదా.. ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఈ రోజుకీ ఏటీఎంల్లో డబ్బులు ఉండటం లేదు. ఆ రోజు నేను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకం చేశారు. డిజిటల్‌ కరెన్సీ తీసుకురావాలన్నా. రూ.2000 నోటు, రూ.500 నోటు రద్దు చేయమన్నా. డిజిటల్‌ కరెన్సీ వస్తే ప్రతి బదలాయింపు రికార్డు అయ్యేది. ఎన్నాళ్లయినా వెలికితీయడం సాధ్యమయ్యేది. నోట్లతో అవినీతి తగ్గించడం కష్టం’ అని చంద్రబాబు అన్నారు. 

క్రమశిక్షణాయుత నిర్ణయాలు తీసుకుంటున్నామని కేంద్రం అంటోందని ప్రస్తావించగా.. ‘ఇదేం క్రమశిక్షణ? ఇది చేతకానితనం’ అని బదులిచ్చారు. ‘మన దేశం గొప్పతనం వల్లే ఈ మాత్రమైనా ఆర్థిక వ్యవస్థ నిలబడింది. ఏం చేయకుండా ఉన్నా ఇంతకన్నా గొప్పగా ఉండేది. దేశంలో ఏ ఇతర ప్రభుత్వం ఉన్నా ఆర్థిక పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గానే ఉండేది. క్రమశిక్షణ ఉంటే ఇంత అవినీతి జరిగేదా? ఇక్కడ వైకాపా నాయకులతో దోస్తీ చేస్తున్నారు. నీతి నిజాయతీలపై మాట్లాడే అర్హత వాళ్లకు లేదు’ అని అన్నారు.