అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. అసెంబ్లీకి రానివారు ఎమ్మెల్యేలుగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలన్నారు. బాధ్యత మరచిన వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడాన్ని మాత్రం మరవడం లేదని దుయ్యబుట్టారు. 

మరోవైపు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా అంశంలో టీడీపీ ఎంపీలు బ్రహ్మాండంగా పోరాడారని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీల పోరాటంతో తెలుగువారి గౌరవం పెరిగిందన్నారు. టీడీపీ పోరాటం చేస్తే వైసీపీ ఎంపీలు మాత్రం పార్లమెంట్ లో పోరాడలేకపోయారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టీడీపీ అభివృద్ధి పథంలో నడిపిస్తోందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కంటే ఎక్కువే చేశామని తెలిపారు.

 ఏపీకి కేంద్రం సహకరిస్తే మరింత అభివృద్ధి జరిగేదన్నారు. ఏపీపై కేంద్రప్రభుత్వం కక్ష కట్టిందని చంద్రబాబు ఆరోపించారు. ఏపీకి మరిన్ని విద్యాసంస్థలను కేంద్రం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

కేంద్రప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం సఖ్యతతో ఉంది కాబట్టే తెలంగాణ డిమాండ్లు సాధించుకుంటుందన్నారు. తెలంగాణ సమస్యలను నాలుగురోజుల్లో పరిష్కరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.