నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రజలు భయంతో బిక్కుబిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంటుందని వ్యాఖ్యానించారు.

 నెల్లూరు జిల్లా దామవరంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, జగన్ అధికారంలోకి వస్తే తాము కూడా జైలుకు వెళ్తామన్న భయంతో పెట్టుబడులు పెట్టేవారు వెనక్కి వెళ్లిపోతారన్నారు. జగన్ ను చూస్తే పెట్టుబడులు పెట్టకుండా ఇన్వస్టర్స్ పారిపోతారని విమర్శించారు. 

ఎవరూ పెట్టుబడులు పెట్టరని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ వల్ల చాలా మంది పారిశ్రామిక వేత్తలు వారి జీవితాలు నాశనం చేసుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్ చేసిన పనుల వల్ల కొంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకు సైతం వెళ్లారని విమర్శించారు. తాను జగన్ లా వ్యవహరించనని సమర్థవంతమైన పాలన అందిస్తున్నట్లు తెలిపారు.