అమరావతి : లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో గుబులు చెలరేగుతోందా..?మార్చి రెండో వారంలో సినిమా విడుదల చెయ్యాలని సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఆ సినిమా రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా..?

టీజర్లు చూసి కోర్టులను టీడీపీ నేతలు ఆశ్రయించడం వెనుక మర్మమేంటి..?ఎమ్మెల్యేలు దగ్గర నుంచి మంత్రుల వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై ఎందుకు ఉలిక్కిపడుతున్నారు..?వారి ఆందోళనే చంద్రబాబులోనూ మెుదలైందా..?లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై చంద్రబాబు వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి..?

 ఇవే తెలుగు రాష్ట్రాల్లో అందరి మదిని తొలిచివేస్తున్న ప్రశ్నలు. సినీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేర్గాంచిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. దివంగత సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ఈ చిత్రం విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. మెుదటి ట్రైలర్ రిలీజ్ చూసే తెలుగు తమ్ముళ్లు కోర్టు మెట్లెక్కేశారంటే ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈసినిమాపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 

గురువారం ఉదయం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఈ సినిమాపై  ప్రస్తావించారు.  ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తిని అందరూ చాటిచెప్పాలని కోరారు. 

నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కథానాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తిని తెలియజేసేలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. మహానాయకుడు కూడా అలానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని పరోక్షంగా రామ్ గోపాల్ వర్మను హెచ్చరించారు.