Asianet News TeluguAsianet News Telugu

వ్యవసాయంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రభుత్వం ఎదుర్కొంటున్న కష్టాలతో పాటు టీడీపీ సర్కార్ చేపట్టిన వివిధ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ఇవాళ నాలుగవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

AP CM chandrababu naidu released 4th white paper
Author
Amaravathi, First Published Dec 26, 2018, 11:50 AM IST

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రభుత్వం ఎదుర్కొంటున్న కష్టాలతో పాటు టీడీపీ సర్కార్ చేపట్టిన వివిధ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ఇవాళ నాలుగవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలపై చంద్రబాబు ఈ శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఐక్య రాజ్య సమితి మాటలను  సీఎం తెలిపారు ‘‘ వ్యవసాయం అత్యంత పవిత్రమైన వృత్తి..అత్యంత నిజమైన వాస్తవికమైన, విలువైన ఆదాయం వ్యవసాయ రంగంలోనే సృష్టించబడుతుంది. అందుకే దీనిని ప్రాధమిక రంగమన్నారు. పునాది బలంగా లేకపోతే భవనం కూలిపోతుంది. వ్యవసాయం రంగంలో ఎంత వృద్దిని సాధిస్తే భవిష్యత్తులో ఇతర రంగాలు ఎంతో వేగంగా పరిగెత్తుతాయి. ప్రపంచంలో ముఖ్యమైన 34 దేశాల ఆర్ధిక వ్యవస్థలను అధ్యయనం చేసిన తర్వాత నేను నేర్చుకున్న ప్రాథమిక, ఆర్ధిక సూత్రాలివే ’’ అంటూ చంద్రబాబు గుర్తు చేశారు.

వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి చెందితే ప్రజల్లో అంత కొనుగోలు శక్తి పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. జనాభాలో 65 శాతం మంది వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరి ఆదాయం పెరిగితే పారిశ్రామిక, సేవారంగంల్లో వృద్ధి దానంతట అదే పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో 2014కు ముందు ఆత్మహత్యలు, అప్పులు, కరెంట్ కోతలు, లో ఓల్టేజ్, చివరికి కోనసీమలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి నెలకొందని చంద్రబాబు గుర్తుచేశారు.

కల్తీ విత్తనాలు, నీటిఎద్దడి, వలసలు జరిగాయన్నారు. విభజన తర్వాత రాయలసీమ కరువు కోరల్లో చిక్కుకుందని, కోస్తా ప్రాంతంలో విపరీతమైన తుఫాన్లు వచ్చాయని దీని వల్ల పంటలు నష్టపోయామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాయదుర్గం ప్రాంతంలోని కరువును రూపుమాపడానికి కోట్లు ఖర్చుపెట్టామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతుల్లో ఆత్మస్థైర్యం పెంపోందించే చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోడీతో రుణమాఫీ గురించి చర్చించానని.. రుణమాఫీ గురించి ప్రచారంలో ప్రకటించమంటే ఆయన ససేమిరా అన్నారని గుర్తుచేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపై సహకరించాలని కేంద్రమంత్రులను అడిగానని, ఎన్నో బాధలకు తట్టుకుని తాను రుణమాఫీని అమలు చేశానన్నారు. విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన 16 వేల కోట్ల లోటులోనూ కోతలు పెట్టారని చంద్రబాబు వెల్లడించారు. అన్ని ఇబ్బందుల్లోనూ రూ.1,50,000 రుణమాఫీ చేయడంతో పాటు మిగిలినది దశలవారీగా మాఫీ చేశామని.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కూడా కేవలం లక్ష రూపాయలే మాఫీ చేశారని సీఎం తెలిపారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రూ. 24 వేల కోట్లు రుణమాఫీ చేశామని చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయానికి సాగునీటిని అందించేందుకు గాను 62 ప్రాజెక్టులను పూర్తి చేయాలని సంకల్పంగా పెట్టుకున్నామని ఇప్పటి వరకు 17 ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా సస్యశ్యామలమైందని..కృష్ణా నీటిని రామలసీమకు తరలించామని తెలిపారు. అక్వా కల్చర్ కారణంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేలా ప్రణాళికలు అమలు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

భూసార పరీక్షతో పాటు, నాణ్యమైన విత్తనాలు, గిట్టుబాటు ధర, కౌలు రైతులకు రుణం, ఎరువులు సకాలంలో అందించామని వీటి వల్ల రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని సీఎం తెలిపారు. వ్యవసాయం ద్వారా 2013-14లో లక్షా 28 వేల కోట్ల రూపాయల సంపద సృష్టించబడితే.. 17-18 నాటికి అది 2 లక్షల 52 వేల కోట్లకి చేరిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. వ్యవసాయం కోసం 7 మిషన్లు, 5 గ్రిడ్లు పెట్టుకున్నామని ‘‘పొలం పిలుస్తోంది’’ కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కల్పించామన్నారు.

2014-15 34 శాతం వర్షపాతం లోటు ఉందని 15-16 లో 5 శాతం,  16-17లో 29 శాతం, 17-18లో 14 శాతం తక్కువ వర్షపాతం తక్కువగా నమోదైందని.. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తల కారణంగా లోటును అధిగమించామని చంద్రబాబు వెల్లడించారు. ఈ ఏడాది 19 వేల 70 కోట్ల రూపాయలను వ్యవసాయ బడ్జెట్‌కు కేటాయించామన్నారు. వరుసగా 3 సంవత్సరాల పాటు భూసారాన్ని పెంపోందించినందుకు అవార్డులు దక్కాయన్నారు.  

100 శాతం సబ్సిడీతో 20 లక్షల హెక్టార్లకు సూక్ష్మ ఖనిజ లవణాలను అందజేశామన్నారు. రైతు మిత్ర పథకం ద్వారా గత ప్రభుత్వాలు రైతుల్లో గందరగోళం సృష్టించాయని మండిపడ్డారు. 35 లక్షల 94 వేల మందికి రుణవిముక్తితో పాటు ఆత్మస్థైర్యాన్ని కల్పించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 47.17 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశామని, రూ.670 కోట్ల వ్యయంతో కర్నూలు జిల్లా తంగడంచలో మెగా సీడ్ సీడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ. 9,411 కోట్లు ఖర్చు చేసి 25 లక్షల మంది కౌలు రైతులకు రుణసాయం అందించామని చంద్రబాబు ప్రకటించారు.

రూ. 3,605 కోట్ల విలువ చేసే ఇన్‌పుట్ సబ్సిడీ అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా తుఫాన్లలో భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని బాబు తెలిపారు. 971 గ్రామాలు,  331 మండలాలను జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి తీసుకొచ్చామని.. ఈ ఏడాది 5 లక్షల రైతులు, 5 లక్షల ఎకరాలను దీని కిందకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మిరప, పత్తి, కోకో, బొప్పాయి, టమోటా సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని.. అలాగే జీడిపప్పు, మామిడి ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు.

హార్టికల్చర్‌లో అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. రానున్న రోజుల్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రి ప్రొసెసింగ్‌‌లలో రాయలసీమ నాలుగు జిల్లాలు ముందు వరుసలో నిలుస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మైక్రో ఇరిగేషన్‌‌ రంగంలో 90 శాతం సబ్బిడీ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు. పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచామని.. ‘‘గోకులం’’ పథకం ద్వారా పశువులను ఎక్కడ కావాలంటే అక్కడ నిలుపుకోవచ్చన్నారు.

972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండటం ఆంధ్రప్రదేశ్‌కు వరమని.. దీని కారణంగా అక్వా రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే చేపల్లో ఏపీ వాటా 22 శాతంగా ఉందన్నారు. వరికి  కేంద్రప్రభుత్వం రూ.13,500 పెట్టుబడిగా ప్రకటిస్తే... మన ప్రభుత్వం రూ.15,000 చేసిందని.. మొక్కజోన్నకు కేంద్రప్రభుత్వం రూ.6,500 చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో రూ.12,000 ఇస్తున్నామన్నారు. మిగిలిన రాష్ట్రప్రభుత్వాలు కేంద్రప్రభుత్వాన్ని అనుసరిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

రూ.3761 రూపాయల విలువైన ఇన్‌పుట్ సబ్సిడీ అందించి రైతులకు ప్రయోజనం చేకూర్చామన్నారు. పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకాన్ని నాలుగు సంవత్సరాల కాలంలో రూ. 5 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించామని.. దీని వల్ల కేంద్రప్రభుత్వానికి రూ.815 ఆదా అవ్వగా, రైతులకు రూ.943 కోట్లు ఆదా అయ్యిందిని చంద్రబాబు చెప్పారు. నాలుగేళ్లలో 2,209 మెట్రిక్ టన్నుల పెస్టిసైడ్స్‌ని ఆదా చేశామని, దీని వల్ల రైతులకు రూ. 1,933 కోట్ల రూపాయల డబ్బు ఆదా అయ్యిందన్నారు.

అంతేకాకుండా రైతుల ఆరోగ్యం కూడా మెరుగైందని .. దీనిని నీతిఅయోగ్ సైతం ప్రశంసించిందని, ఏపీ విధానాలను దేశవ్యాప్తంగా అమలు పరచాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కత్తెర పురుగును పూర్తి స్థాయిలో నిర్మూలించి పంటలను కాపాడామన్నారు. 12 మార్కెట్ కమిటీల్లో ఈనాం విధానాన్ని ప్రవేశపెట్టామని చంద్రబాబు తెలిపారు. గుంటూరు మార్కెట్ యార్డ్ ఈ-ట్రేడ్ విధానంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ 3,530 ఎలక్ట్రానిక్ పేమెంట్ చేసి అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.

ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రూ. 6, 278 కోట్ల పెట్టుబడులు, 57, 270 మందికి ఉపాధి లభించిందని చంద్రబాబు ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించామన్నారు. టాటా స్మార్ట్ ఫుడ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుందని సీఎం అన్నారు.

2 కోట్ల ఎకరాలకు సాగునీటి సదుపాయాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందుకోసం వర్షపునీటి సంరక్షణ, చెరువుల పునరుద్దరణ, మిగులు జలాల వినియోగం, భూగర్భ జలాల పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టామన్నారు.

నదుల అనుసంధానం ద్వారా సూక్ష్మసాగునీరు విధానం కోటి ఎకరాలకు తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు తెలిపారు. కరువును సైతం తట్టుకునే విధంగా వ్యవసాయం రంగంలో సంస్కరణలు చేపడతామన్నారు. తుఫాన్లకు ముందుగానే పంట చేతికి వచ్చేలా జూన్ నాటికి నీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios