నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన రెండు ప్రాజెక్ట్‌లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని రాజధానికి అనుసంధానిస్తూ కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద నిర్మించనున్న ఐకానిక్‌ వంతెనకు సీఎం శంకుస్థాపన చేశారు.

దానితో పాటు రాజధాని తాగునీటి అవసరాల కోసం నీటిశుద్ధి ఫ్లాంట్‌కు కూడా ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఐకానిక్ వంతెన ద్వారా కృష్ణా జిల్లా-అమరావతి ప్రజల రాకపోకలకు అనువుగా ఉంటుందన్నారు.

కృష్ణా నది అమరావతికి ఓ వరమన్నారు. ఇక్కడున్న వారంతా హైదరాబాద్‌కు, ఇతర దేశాలకు వెళ్లారు తప్పించి అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ల్యాండ్‌ఫూలింగ్ ముందుకొచ్చిన రైతులు 34 వేల ఎకరాలు రాజధానికి భూమికి ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇప్పటివరకు 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌లు రాష్ట్రానికి వచ్చాయన్నారు. భవిష్యత్తులో కృష్ణానదిపై కట్టబోతున్న ఐకానిక్ బ్రిడ్జిని చూడటానికి ప్రపంచనలుమూలల నుంచి వస్తారని తెలిపారు. కృష్ణానదికి కుడి ఎడమల వైపు అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

వృద్ధాప్య పెన్షన్‌‌ను రూ.1000 నుంచి రూ.2000కు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రజలకు స్ఫూర్తని, ఎన్నో కష్టాలకు వోర్చి జీవితంలో అనుకున్నది సాధించారని సీఎం గుర్తు చేశారు. కూచిపూడి మన వారసత్వ సంపదని, అందుకే ఈ బ్రిడ్జి పేరు ‘‘కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జి’’గా నామకరణం చేస్తున్నట్లు చంద్రబాబు గుర్తు చేశారు.

అమరావతిలో వెంకటేశ్వరస్వామి దేవాలయంతోపాటు చర్చి, మసీదును నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కూచిపూడికి ఉన్న గుర్తింపు దృష్ట్యా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రకృతి సేద్యానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఈ విధానంలో ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా వ్యవసాయం చేయడమేనన్నారు. ప్రపంచంలోని ఐదు అద్భుతమైన నగరాల్లో అమరావతి తప్పకుండా ఉంటుందన్నారు. ప్రజా రాజధానిలో 50 వేలమందికి ఇళ్లు కట్టించడానికి స్థలం కేటాయించామని సీఎం తెలిపారు. దేశంలో తాజ్‌మహాల్ తర్వాత ఏపీ అసెంబ్లీ గురించే మాట్లాడుకోవాలని చంద్రబాబు అన్నారు.