తిరుపతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చారు. 

తిరుపతిలో ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు. తనకు తన కుటుంబం కన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎక్కువ అంటూ చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా ప్రజలకు మెురుగైన సేవలందించామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలోనే చెప్పారని గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, వైసీపీకి ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లేనని తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే స్వచ్ఛమైన పాలన వస్తుందని మోదీ అన్న మాటలను గుర్తు చేశారు. స్కామాంధ్ర కావాలా..స్కీమ్ ఆంధ్రా కావాలా అంటూ చెప్పకొచ్చిన మోదీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. 

మోదీ తిరుమల తిరుపతి సాక్షిగా హామీ ఇచ్చి ఆ తర్వాత నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని చెప్పుకొచ్చారు. 

ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలను అమలు చెయ్యలేదని చెప్పుకొచ్చారు. నరేంద్రమోదీ నమ్మించి మోసం చేస్తే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు చంద్రబాబు. 

తమకు న్యాయపరంగా రావాల్సిన హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తే తమను వేధింపులకు గురి చేశారని చెప్పుకొచ్చారు. ఐటీ, ఇన్ కమ్ ట్యాక్స్ లతో దాడులకు పాల్పడతారా అంటూ విరుచుకుపడ్డారు. బాంబులకు, బుల్లెట్లకు భయపడలేదు, నీకు భయపడతామా అంటూ మోదీపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.