అమరావతి: రాబోయే ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులను ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రకటించాలని నిర్ణయించారు. 

ఇప్పటికే ఆయా జిల్లాలలో నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు షెడ్యూల్ విడుదలవ్వకముందే తొలిజాబితా సిద్ధం చెయ్యాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఒక జాబితాను రెడీ చేసినట్లు తెలుస్తోంది. 

రాష్ట్రవ్యాప్తంగా 125 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబు రెడీ చేసినట్లు సమాచారం. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని ఈ నేపథ్యంలో అదే తరహాలో ఏపీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. 

అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే ఎన్నికల ప్రచారానికి మరింత సమయం ఉంటుందని ఫలితంగా విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు చర్చించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు అభ్యర్థుల తొలిజాబితా ప్రకటనపై స్పష్టత ఇచ్చారు. 

తొలి జాబితాలో 100 నుంచి 125 మంది అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు జిల్లాల అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. 

నెల్లూరు, కడప, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కూడా మెజార్టీ సీట్లపై చంద్రబాబు స్పష్టంగా ఉన్నారని సమాచారం. భిన్నాభిప్రాయాలు ఉన్న స్థానాలపై చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని స్థానాలను కావాలనే చంద్రబాబు నాయుడు జాప్యం చేస్తున్నట్లు లీకులు వచ్చాయి. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో మేనిఫెస్టో, ఎన్నికల స్ట్రాటజి కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అలాగే రైతు సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరంపై పొలిట్ బ్యూరో మీటింగ్ లో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం.