అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు లంకగ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. 

ఏపీలో నదులు ఉగ్రరూపం దాల్చడంతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రంలో ఓవైపు వరదలు ముంచెత్తుతున్నాయని, మరోవైపు కరెంటు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏ వైపు నుంచి ఏ పాములు కొట్టుకొస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పిల్లా పాపలతో కుటుంబాలు నరకాన్ని చూస్తున్నాయని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. 

ఆపదలో ఉన్న ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తక్షణమే సహాయ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వరదల్లో చిక్కుకున్న ఓ బాధితుడి ఆవేదనకు సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

ఇకపోతే వైద్యపరీక్షల నిమిత్తం నాలుగు రోజులపాటు అమెరికాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు శనివారం తెల్లవారు జామున హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి అమరావతి బయలు దేరి వెళ్లిపోయారు. త్వరలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.