టీడీపీ-జనసేనతో కలిసి అఖిలపక్ష భేటీలో కూర్చోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం హాస్యాస్పదమన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019పై పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జైల్లో కూర్చుంటారు గానీ.. అఖిలపక్ష భేటీలో కూర్చోరా అని ప్రశ్నించారు. గత 16 ఏళ్లలో కన్నా లక్ష్మీనారాయణ తనపై 3 పిటిషన్లు వేశారని వైఎస్ స్వయంగా 13, అనుచరులతో 12 కేసులు వేయించారని చంద్రబాబు అన్నారు.

జగన్ తన తల్లితో 2,464 పేజీలతో పిల్ వేయించారని కానీ వాటన్నింటినీ కోర్టులు కొట్టేశాయని సీఎం గుర్తుచేశారు. జగన్, మోడీ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని వాటిని కన్నా లక్ష్మీనారాయణ అమలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ, బీజేపీ కుట్రల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. 

అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1 రాష్ట్రానికి బ్లాక్ డేగా సీఎం అభివర్ణించారు. ఇప్పటి దాకా బీజేపీ 5 బడ్జెట్లు ప్రవేశపెట్టి ఏపీని మోసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

నల్లబ్యాడ్జీలు, నల్ల జెండాలతో ఎంపీలు నిరసన తెలపాలని సూచించారు. శాంతియుతంగానే నిరసనలు ఉండాలని.. రాష్ట్ర రాబడికి నష్టం కలిగేలా నిరసనలు ఉండొద్దని ముఖ్యమంత్రి అన్నారు.