కేంద్రం అన్యాయం చేసినందుకే అన్యాయం చేసినందుకే న్యాయపోరాటం చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విభజన చట్టం హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ ఆయన దేశరాజధాని ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు దిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అంశాలను కేంద్రప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. హోదా ఇస్తేనే ఏపీ కోలుకుంటుందని విభజన సమయంలో చెప్పారన్నారు.

పదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వాలని జైట్లీ అప్పుడు అన్నారని, పదేళ్లు హోదా అడిగిన మీరు ఇప్పుడు మాట నిలబెట్టుకోలేదని బీజేపీపై ఫైరయ్యారు. రెవెన్యూ లోటు కూడా తీర్చలేదని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారు..

ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక రాష్ట్రం పట్ల వివిక్ష చూపినప్పుడు న్యాయం కోసం పోరాడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుకు నిరంతరం పోరాడుతున్నామని, కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ధర్మాన్ని కాపాడాలని గతంలో వాజ్‌పేయ్...మోడీకి చెప్పారని, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు మనం పోరాడాల్సిందేనని ముఖ్యమంత్రి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను పరిష్కరించలేదని ఎద్దేవా చేశారు.

పోలవరం డీపీఆర్ ఇప్పటి వరకు అంగీకరించలేదని, అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చి , ఇప్పటి వరకు 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు వెల్లడించారు. ఆదివారం గుంటూరులో జరిగిన సభలో నన్ను విమర్శించడానికే ప్రధాని పరిమితమయ్యారని,  మోడీ వ్యక్తిగత విమర్శలకు దిగారని మండిపడ్డారు.

న్యాయం చేయమని అడిగితే వ్యక్తిగత విమర్శలు చేస్తారా ..? సత్తా ఏంటో చూపించడానికే ఇక్కడికి వచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తగిన విధంగా బుద్ధిచెబుతామని చంద్రబాబు హెచ్చరించారు.

మేం పోరాడేది మా హక్కుల కోసం.. మీ భిక్ష కోసం కాదన్నారు. మోడీకి పాలించే అర్హత లేదన్నారు. లెక్కలు చెప్పడానికి నేను సిద్ధమని... మేం కట్టే పన్నుల లెక్కలు చెప్పడానికి మీరు సిద్ధమా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

పరిపాలించే వ్యక్తులు బాధ్యతగా ఉండాలని, బాధ్యత విస్మరించి అధికారం నెత్తికెక్కినప్పుడు బుద్ది చెప్పే అధికారం ప్రజలకు ఉందని గుర్తుపెట్టుకోవాలని సీఎం అన్నారు. జీవితంలో ఆస్తులు పొగొట్టుకుంటే మళ్లీ సంపాదించుకోవచ్చు..

కానీ ఆత్మగౌరవాన్ని పొగొట్టుకుని బతకకూడదని ఎన్టీఆర్ చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. చేసిన తప్పుకు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణలు చెప్పి, విభజన చట్టాన్ని అమలు చేయాలన్నారు. లేదంటే బీజేపీకి ఏపీలో శాశ్వతంగా ద్వారాలు మూసుకుపోతాయని చంద్రబాబు హెచ్చరించారు.

ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఢిల్లీ రావడానికి వీలు లేకుండా అడ్డంకులు కలిగించారని అవేమి తమను అడ్డుకోలేవని సీఎం అన్నారు. చట్టాన్ని అమలు చేయమంటే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.