మోడీ ఓడితేనే ఆంధ్రప్రదేశ్ గెలుస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నెల 27న రాజమహేంద్రవరంలో జరగనున్న ‘‘జయహో బీసీ సదస్సు’’ ఏర్పాట్లు గురించి ఉండవల్లలోని ప్రజావేదికలో బీసీ నేతలతో సీఎం చర్చించారు.

అధికారం చేతిలో ఉందనే గర్వం, ఏమరపాటు తనకు లేదన్నారు. జీవితాంతం వెనుకబడిన వర్గాలకు రుణపడివుంటానని సీఎం స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఇక్కడ మాట్లాడుతున్నానంటే అందుకు కారణం వెనుకబడిన వర్గాలేనన్నారు.

బీసీలను మరచిపోతే నన్ను నేను మరచిపోయినట్లేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఫెడరేషన్లను కార్పోరేషన్లుగా మార్చేందుకు ఆలోచిస్తున్నామన్నారు.  బీసీ గ్రూపుల్లో మార్పులు, చేర్పులు రిజర్వేషన్ల శాతంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

బీసీలే తన హైకమాండని వారు ఏం చెబితే అదే చేస్తానన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కోసం విజన్-2022, 2029, 2050 రూపొందించామని తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణతో సమానంగా ఎదగాలంటే అందరం 15 ఏళ్లు శ్రమించాలన్నారు.

విభజన చట్టంలో అన్యాయం జరిగిందని మోడీపై పోరాటం చేస్తున్నామని సీఎం అన్నారు. బీజేపీ నాయకుల ఆటలు తెలుగు ప్రజల ముందు సాగవని హెచ్చరించారు.  జయహో బీసీ సభకు అందరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.